పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు.. 

టీడీపీ నేతలకు లేదు
– పోలవరంకు పునాధి వేసింది దివంగత వైఎస్‌ఆర్‌
– జగన్‌ను విమర్శించే స్థాయి దేవినేని ఉమకు లేదు
– వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత పార్థసారధి
విజయవాడ, ఆగస్టు7(జ‌నంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారధి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. అసలు పోలవరంకు పునాది వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అయితే, టీడీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. పోలవరంతో సంబంధాలేని విషయాల్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం రాజకీయ జ్ఞానం లేకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దేవినేని ఉమ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  మంత్రి ఉమ చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. దేవినేని స్థాయి మరచి మాట్లాడుతున్నారని, పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్‌ వారసులకే ఉందనే విషయం గుర్తించుకోవాలన్నారు.  ఉమ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఈ సందర్భంగా పార్థసారధి సవాల్‌ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు.
ప్రాజెక్టులపై బీజేపీ, టీడీపీ ప్రజలను మోసం చేస్తూ ట్రిక్కులు చేస్తున్నాయని మండిపడ్డారు. ముందు మంత్రి ఉమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానేసి, రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించాలన్నారు. జిల్లాల్లో చాలా చోట్ల నీరు లేక పంటలు ఎండిపోతున్న విషయం మంత్రలు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. 2019లోగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్థసారధి తెలిపారు. ఉమకు సిగ్గుంటే చంద్రబాబు ప్రభుత్వంపై సీబీఐ విచారణకు చేయించుకునే దమ్ముందా? అని పార్థసారధి చాలెంజ్‌ విసిరారు.

తాజావార్తలు