పోలవరం నిధుల విడుదలలో జాప్యం

అంచనా వ్యవయం పెరగడంతో అయోమయం
కేంద్రానికి మొరపెట్టుకుంటున్నా కానరాని ఫలితం

న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ): దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో కేంద్రమే దీనిని పర్యవేక్షించి పూర్తి చేయించాలి.
గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, అక్కడి నుంచి ఎగువన ప్రకాశం, గుంటూరు జిల్లాకు కూడా వినియోగించుకుంటామని, తద్వారా రాయలసీమలో నీటి కొరతను అధిగమిస్తామని పాలకులు భారీ
ఆశలు కల్పించారు. కానీ చట్టం ప్రకారం జాతీయ హోదా అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 8 బడ్జెట్లలో పోలవరం నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ. 11,182 కోట్లు. ఇప్పటి వరకూ పునరావాసానికి రూ. 6900 కోట్లు వెచ్చించగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరో రూ. 20 వేల కోట్లు అవసరం అవుతాయి. టెక్నికల్‌ కమిటీ ఆమోదం పొందిన డి.పి.ఆర్‌ 2 ప్రకారమే 1.05 లక్షల కుటుంబాలకు గానూ రూ. 27 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దాంతో పాటుగా కాలువల నిర్మాణం పూర్తి చేయడం, ఇప్పటికే 15ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లో శిథిలమవు తున్న వాటిని సిద్ధం చేసేందుకు కనీసంగా మరో రూ. 5 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తిశాఖ అంగీకారం తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖకు,కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదింపజేస్తామని జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హావిూ ఇచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి పెట్టుబడి క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరుతూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలశక్తిశాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ సూచీని అనుసరించి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తిశాఖకు సిఫారసు చేశాయి. దీన్ని సీడబ్ల్యూసీ పరిధిలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) పరిశీలించి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఆమోదించి జలశక్తిశాఖకు సిఫారసు చేసింది. సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా సిఫారసు చేసి ఆమోదించాలని ఎపి కోరుతోంది. కానీ మంత్రి ఆర్‌సీసీ సిఫారసు చేసిన మేరకు రూ.47,725 కోట్లను ఆమోదిస్తామన్నారు. కాఫర్‌ డ్యామ్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో దానిని పూర్తిగా మూసేయాలంటే ముందుగా పునరావాసం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆదేశించింది. గత డిసెంబర్‌ నెలలో ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించిన డిజైన్‌ రివ్యూ కమిటీ కూడా ఇదే విషయం తేల్చి చెప్పింది. అప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీని పూడ్చేసేందుకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది. ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పి మాట తప్పారు. ఇక బహుళార్థక ప్రాజెక్టులో భాగంగా పవర్‌ హౌస్‌ అందుబాటులోకి తెచ్చేందుకు మరో ఐదారు వేల కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇప్పుడున్న స్థితిలో పోలవరం పూర్తి కావాలంటే కనీసం రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప అవకాశం లేదు. కానీ కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలకు మించి పైసా కూడా చెల్లించబోనంటోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రీయంబర్స్‌ చేయడంలోనూ కొర్రీలు వేస్తోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట మూలంగా ప్రస్తుతం అన్యాయమవుతున్న నిర్వాసితులతో పాటుగా ప్రాజెక్టు విూద ఆశలు పెట్టుకున్న రైతాంగం కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తన్నాయి.