పోలవరం పేరెత్తే అర్హత జగన్‌కు లేదు
ప్రాజెక్టులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే చరిత్ర క్షమించదు
– ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాసుల కక్కుర్తితో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిన సంగతి జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తారో? ఆయనకు చెందిన రూ.40వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ ఎందుకు జప్తు చేసిందో? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడమే జగన్‌కు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు ఈ నాలుగేళ్లలో 187 టీఎంసీల నీరు మళ్లించిన సంగతి ప్రతిపక్ష నేతకు కనబడటం లేదని
ఉమ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఆపేందుకు ప్రయత్నిస్తున్న జగన్ చరిత్ర హీనుడుగా మారిపోతారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలకు సమాచారమిచ్చి కేసులు వేయించింది నీవు కాదా అని, మెట్ట ప్రాంతాలకు నీరు తరలిస్తుంటే విషం చిమ్ముతున్నారని, బలవంతంగా టెండర్లు క్లోజ్ చేయించింది ఎవరో అందరికీ తెలుసని జగన్‌పై మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం పనులు 57.14 శాతం పూర్తవుతాయని, గోదావరిలో లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉందని, డౌన్‌సైడ్ జెట్ గ్రౌటింగ్ పూర్తి చేస్తామని ఆయన హావిూ ఇచ్చారు. కుడి కాలువ ద్వారా 6 లక్షల ఎకరాలకు గోదావరి నీరందించామని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో డ్యాం సైట్‌లో 1.4 శాతం మాత్రమే పనులు చేశారన్నారు. మేం 43 శాతం పనులు పూర్తి చేశామని, ఈ విషయాన్ని కేవీపీ గుర్తుంచుకోలేదా? అని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషిచేస్తూ, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా పుంజుకొనేలా చేస్తారని కొనియాడారు. ప్రత్యేక ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేసి కేంద్రానికి జగన్, పవన్‌లు అండగా ఉంటూ చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటన్నారు. ఓ పక్క ఏపీకి న్యాయం కోసం చంద్రబాబు కేంద్రంతో పోరాడుతుంటే పోరాటంలో కలిసిరావాల్సిన ప్రతిపక్ష నేత జగన్, పవన్ కళ్యాణ్‌లు చంద్రబాబునే విమర్శిస్తుండటం ఆశ్చర్యమేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్, పవన్‌లకు ఏమాత్రం చితత్తశుద్ది ఉందో ఈపరిస్థితిని భట్టి అర్థమవుతుందన్నారు.