పోలీసులపై ‘దానం’ దాదాగిరి

హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 : స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆలయ తలుపులను మూసివేయాల్సిందేనని మంత్రి దానం నాగేందర్‌ హుకుం జారీ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న మంత్రి నాగేందర్‌ మీడియాతో మాట్లాడారు. ఆలయానికి వచ్చిన మహిళల పట్ల ఇస్కాన్‌ ప్రతినిధులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు వచ్చిన తాను ఆ విషయంపై వారిని వివరణ అడిగానని చెప్పారు. వాటిపై వివరణ ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు కొందరు ప్రతినిధులపై విరుచుకుపడ్డారని అన్నారు. గందరగోళాన్ని చక్కదిద్దే క్రమంలో అందరినీ బయటకు తీసుకువచ్చి గేట్‌కు తాళం వేసినట్టు చెప్పారు. ఇస్కాన్‌ల లీజులు రద్దు చేయిస్తామని, ఇదే విషయాన్ని ఎండోమెంట్‌ అధికారులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఈ ఆలయ లీజు వ్యవహారాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానని చెప్పారు. వచ్చిన భక్తుల నుంచి ముడుపులు స్వీకరిస్తూ సేవలందిస్తున్నారని చెప్పారు. స్వచ్ఛందగాసేవలందించాల్సిన వారు టెంకాయ కొట్టేందుకు కూడా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో లీజు రద్దు చేయాలని తాము కోరుతున్నామన్నారు. భగవంతుడు అందరికీ చెందినవాడని, ఆ విషయాన్ని మరచి దోచుకునేందుకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఇదిలా ఉండగా మంత్రి నాగేందర్‌ అనుచరులు వచ్చి తమ సేవలను అడ్డుకోవడమేకాకుండా దుర్భాషలాడారని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాక ఆలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
కబ్జాకు యత్నిస్తున్నారు
ఇస్కాన్‌కు చెందిన కొందరు భూకబ్జాకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అంతేకాక ఆలయానికి వెళ్లిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇస్కాన్‌ ప్రతినిధులను, అర్చకులను పంపించి వేయాలని డిమాండ్‌ చేశారు. వారి నుంచి తమను కాపాడాలని మంత్రి దానం నాగేందర్‌కు మొరపెట్టుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పారు.