పోలీసు అధికారులు కాంగ్రెస్ దారులు
త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రిజర్వుడు పోలీస్ ఇన్స్పెక్టర్ కాశీరామ్…
ఇల్లందు, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ప్రభావం
రాజీనామా దిశగా ఆలోచనలు… నాయకులు, మిత్రులు, బంధువులతో మంథనాలు…
బలం పుంజుకోనున్న కాంగ్రెస్ పార్టీ… నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే కలిసివచ్చే అవకాశం…
మహబూబాబాద్ బ్యూరో-జూలై13(జనంసాక్షి)
మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడూరుకు చెందిన రిజర్వుడు పోలీస్ ఇన్స్పెక్టర్ కాశీరామ్ త్వరలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మహబూబాబాద్,ఇల్లందు నియోజకవర్గంపై పలువురు ఆశావాహులు ఇప్పటికి ఉన్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ తగ్గటం లేదు. మహబూబాబాద్ జిల్లాలో రెండు మండలాలు ఉండటంతో మహబూబాబాద్ తో పాటు ఇల్లందు వైపు ఆశావాహులు మొగ్గు చూపడం సహజం.ఇప్పటికే ఒక ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ జనంలో తిరుగుతూ గ్రామ నాయకులను ప్రసన్నం చేసుకుండగా తాజాగా ఈ పోలీసు అధికారి పేరు తెరపైకి రావడంతో మహబూబాబాద్, ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు సానుభూతి పరులు, ప్రజలు ఆ పోలీస్ అధికారికి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే ఆనోట, ఈనోట వెళ్ళుతు సోషల్ మీడియాలో, ప్రముఖ చానాళ్లలో ప్రసారం అయి రాజకీయ చర్చనీయ అంశం అయ్యింది.
– కాశీరామ్ గమనం…
మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడూరు మండలంలోని టేకుల తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన బానోతు కాశీరాం పదోతరగతి ఫెయిల్ అయిన కూడా పట్టు వదలకుండా తిరిగి పదోతరగతి పాసై పోలీస్ శాఖలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సాదించాడు. మహబూబాబాద్, ఇల్లందు నియోజకవర్గంలలో అన్ని వర్గాలకు సూపరిచితునిగా, ఇక్కడ ఉండే కోయలు. గిరిజనులతో పాటు స్థానిక ప్రజలతో, అధికార, అనదికార, ప్రజా ప్రతినిధులతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పటికీ ప్రతి గ్రామం నుంచి ఓ పది మందిని పేరుతో పలుకరించడం ఆయనకు కలిసోచ్చే అంశం. ఉద్యోగం చేస్తున్నప్పటికి ఇక్కడి ప్రజలకు, ముఖ్యంగా కనీస సదుపాయాలకు దూరంగా ఉన్న గిరిజనులకు సేవ చేయాలంటే ఎమ్మెల్యే అయితే మాత్రమే సాధ్యం అవుతుందని ఆయన సన్నిహితుల వద్ద అంటుండేవారు. తన మనసులో బలంగా ప్రజా సేవ చేయాలంటే రాజ్యాధికారమే ఏకైక మార్గం అని విశ్వసించే వాడు. దాంతో సిఐ గా పదోన్నతి వచ్చి బదిలిపై వేరే ప్రాంతానికి వెళ్లినప్పటికీ ప్రతి నెలకోసారి శుభ ఆశుభ కార్యక్రమాలకు మహబూబాబాద్,ఇల్లందు నియోజకవర్గాలలో తిరుగుతు స్థానిక యువతి, యువకులకు, పేద వారికి చేతనైన సహాయం చేసేవారు. ముఖ్యంగా చదువు విషయంలో యువతకు పలు సూచనలు చేసి వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తారని ఆయనకు పేరుంది.
– త్వరలో సిఐ ఉద్యోగానికి రాజీనామా…..!?
ప్రస్తుతం మామునూరు పిటిసి లో సిఐ గా పనిచేస్తున్న బానోతు కాశీరాం త్వరలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈలోపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, స్థానిక నాయకులతో రహస్య చర్చలు జరిపిన తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన సన్నిహితులను, బందువులను వివరణ కోరగా కాశీరామ్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం మాత్రం ఖాయమని ధ్రువీకరించారు. మహబూబాబాద్, ఇల్లందు నియోజకవర్గాల ఆయన సన్నిహితులతో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల ముఖ్య నాయకుల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.