పోలీసు దిగ్బంధంలో సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాను పోలీసులు దిగ్బంధించారు. నేరెళ్ల పోలీస్‌ బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఇప్పటికే లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ కరీంనగర్‌ చేరుకున్నారు. అయితే సిరిసిల్లలో సభకు జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించారు. మరికాసేపట్లో హైకోర్టు తీర్పు కోసం అటు కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసులు ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లా కేంద్రంలో రెండ్రోజుల క్రితమే పోలీస్‌ 30 యాక్ట్‌ అమలు చేశారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐదు జిల్లాల నుంచి భారీగా బలగాలు చేరుకున్నాయి. దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులు సిరిసిల్లను దిగ్బంధించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.