ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గిన వరద

తగ్గని సందర్శకుల తాకిడి

విజయవాడ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ పరవళ్లు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోను, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోను విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గత వారం నుంచి కృష్ణానదికి వరద నీరు రావడం మొదలైంది. అయితే మళ్లీ వానలు తగ్గుముకం పట్టడంతో ఇప్పుడు నీటిరాక నిలకడగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజి గేట్లను కొన్ని మూసేశారు. ఖమ్మం, వరంగల్‌జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. పులిచింతల ప్రాజెక్టుకు దిగువనున్న మునేరు, కట్టలేరు, వైరా, మదిర, పాలేరు, కట్టలవాగుల నుంచి వరద నీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర 12 అడుగుల మేరకే ఉంచుతూ.. మిగిలిన నీటిని బ్యారేజీ గేట్లు ఎత్తివేసి కిందికి వదిలారు. ఆది, సోమవారాల్లో ఒక్కొక్కటిగా గేట్లు ఎత్తుతూ నీటిని కిందికి వదిలారు. సోమవారం గరిష్ఠంగా 64 గేట్లను అడుగు మేర పైకి ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేశారు. మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ప్రవాహం 15 వేల నుంచి 20వేల క్యూసెక్కుల వరకు మాత్రమే ఉన్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. క్రమంగా వరద తగ్గుతుండటంతో మంగళవారం ఒక్కొక్కటిగా 45 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 25 గేట్ల నుంచి మాత్రమే వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా తగ్గిపోతే ప్రకాశం బ్యారేజీ గేట్లను పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. బ్యారేజీ దగ్గర సందర్శకుల సందడి కొనసాగింది. నగర వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి నవారు సెల్పీలు తీసుకున్నారు. నిండుకుండలా మారిన కృష్ణవేణమ్మను చూసి పరవశించారు. బ్యారేజీ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును కొనసాగిస్తున్నారు.

 

తాజావార్తలు