ప్రకృతి ప్రకోపం.. విలవిల్లాడుతున్న తిరుపతి
తిరుమల కొండల నుంచి జాలువారిన జలపాతాలు
తిరుమల ఘాట్ రోడ్లపై విరిగిపడ్డ కొండచరియలుపూర్తిగా నీట మునిగిన తిరుమల,
తిరుపతికడప,నెల్లూరు,చిత్తూరు జిల్లాలు అతలాకుతలం
విజయవాడ,నవంబర్19(జనం సాక్షి ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిరదా అన్నట్లుగా కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేని వర్షంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది.. క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా.. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలోని జలపాతాలు మత్తడి దూకుతున్నాయి. ఇక రోడ్లు, అండర్‌వే బ్రిడ్జీలు జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోగా.. కొన్ని చోట్ల వరద ధాటికి తట్టుకోలేక పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు. ఒకచోట స్వర్ణముఖి నదిలో ఇల్లు కొట్టుకుపోయింది. ఇక పలు చోట్ల రోడ్ల విూద, ఇళ్లలో చేరిన వరద నీటిలో జనాలు ఈత కొట్టారు. తిరుపతి వరదలకు సంభందించిన వీడియోలు ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్డుపై వరద పారుతోంది. దీంతో అధికారులు తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. తిరుమలకు భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడంతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు రెండో ఘాట్ రోడ్‌లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఘాట్ రోడ్లను అధికారులు మూసివేశారు. కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్‌పై వందలాది వాహనాలు స్తంభించాయి. రెండ్రోజుల పాటు కనుమ దారులను మూసివేశారు. తిరుమలలో ఆర్జితం ఆఫీస్ కిందభాగంలోని టీటీడీ సర్వర్ల గదుల్లోకి నీరు ప్రవేశించడంతో అన్ని యంత్రాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవఘాట్ రోడ్డులో 9, 12 కిలోవిూటర్లు, హరిణి వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. మరికొన్ని ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. సాయంత్రం రెండు ఘాట్‌రోడ్లనూ మూసి వేశారు. తిరిగి ఎప్పుడు తెరిచేదీ టీటీడీ తర్వాత ప్రకటించనుంది. తిరుమలలో నారాయణగిరి కాటేజీ వెనుకభాగంలోని కొండల నుంచి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో కొండచరియలు విరిగి కాటేజీలపై పడి దాదాపు నాలుగు గదులు ధ్వంసమయ్యాయి. ఆ గదుల్లో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమలలోని జేఈవో క్యాంపు కార్యాలయం నీట మునిగింది. తిరుమల కొండల నుంచీ భారీగా దిగువకు వచ్చిపడుతున్న వర్షం నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. కపిలతీర్థంలో జలపాతం ఉధృతి పెరగడంతో పుష్కరిణి నిండిపోయి ఆలయంలోకి నీరు ప్రవేశించింది. ఇక తిరుపతిలో 80 శాతం వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊరట కల్పించింది. నేడు, రేపు దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు తరువాతి రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. రేణిగుంట విమానాశ్రయ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుపతి`కడప మార్గాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తిరుపతి`పీలేరు మార్గంలో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. శ్రీనివాస పురం వంతెనపై లారీ చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. కల్యాణి జలాశయం వరద ఉధృతితో పీలేరు మార్గంలో సైతం రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు రహదారులు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం మాడవీధులన్నీ జలమయ మయ్యాయి. ఎన్నడూలేని విధంగా మాడవీధుల్లో బురదతోపాటు మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. భక్తులు దర్శనానికి వెళ్లే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లోకి కూడా నీరు భారీగా చేరింది. కపిలతీర్థం ఆలయంలో 2 రాతి స్తంభాలు, వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపం పైకప్పు కూలిపోయాయి. తిరుమల రోడ్లపై వర్షం నీరు నదిలా ప్రవహించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిత్తూరు`తిరుపతి సిక్స్ లేన్ హైవేపై పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఐదడుగుల నీరు ప్రవహించి లారీ, పలు కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. గాదంకి వద్ద రాడార్ కేంద్రం ప్రహరీ నీటి ఉధృతికి కూలిపోయింది. జిల్లాలో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాకు రప్పించారు. కడప జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో కడప నగరం సహా రాజంపేట, రైల్వేకోడూరు పట్టణాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. పంటలు దెబ్బతిన్నాయి. బుగ్గవంక ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. సీకేదిన్నె మండలంలోని ఎర్రవంక, మూలవంక, ఉధృతంగా ప్రవహించడంతో బుగ్గవంక కాలువలోకి సుమారు 19 వేల క్యూసెక్కుల నీరు పారుతోంది. కడప నగరంలోని బుగ్గవంక పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కడప ప్రధాన రోడ్లలో సుమారు మూడు అడుగుల మేర నీరు పారింది. రాజపేట పట్టణానికి చుట్టూ ఉన్న వాగులు ఒంకలు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వేకోడూరు`తిరుపతి రహదారిలోని బాలపల్లి వద్ద కొండను తొలిచి నిర్మించిన రహదారి వద్ద ఇరువైపులా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రళయాన్ని తలపించేలా రోడ్డుపై నీరు పారుతోంది. ఒక వ్యక్తి రోడ్డు పైనే నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. రాజుకొండ వద్ద చిట్వేలు`నెల్లూరు జిల్లాకు రాక పోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కైవల్యా నది, పెద్దవాగు, మాల్లేరువాగు, కేతమన్నేరు, బొగ్గేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు మండలాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాపూరు ఘాట్‌లోకి వాహనాలను ఆపేశారు. కడప`నెల్లూరు మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.