ప్రకృతి ప్రకోపాలకు మానవ తప్పిదాలే కారణం

కేరళ వరదలకు పర్యావరణ విధ్వంసమే మూలం

తప్పు తెలుసుకోకపోతే మరిన్ని ఉత్పాతాలు

తిరువనంతపురం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): పదిరోజులకు పైగా కేరళలో కుండపోత వర్షాలు సృష్టించిన బీభత్స విధ్వంసం ఆ రాష్ట్ర జనజీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. వర్షాలు కొద్దిగా తెరిపి ఇచ్చినట్టు, వరదనీరు వెనుకపట్టు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరో వైపు కొత్తగా అల్పపీడనాలు ముంచుకు వస్తున్నాయి. వరద తగ్గి నీరు తేలుతున్నప్పుడు, ముగుస్తున్న జలప్రళయం కలిగించిన ప్రాణ నష్టం, ఆస్తినష్టం ఎంతటిదో క్రమంగా తెలిసి వస్తుంది. నాలుగువందల మంది దాకా మరణించారని ఉజ్జాయింపుగా చెప్పుకుంటున్న లెక్కలను తప్పనిసరిగా సవరించుకోవలసి వస్తుంది. ఉపద్రవం ఉపశమించినా సహాయకశిబిరాలలో ఉంటున్న ఏడున్నరలక్షల మంది పునరావాసం, మరమ్మత్తులు సాగేదాకా అక్కడే ఉండవలసి వస్తుంది. పంటలను పనిముట్లను సమస్త జీవనాధారాలను తుడిచిపెట్టిన తరువాత, కోట్లాదిమందికి రోజు గడవడం కష్టం అవుతుంది. కేందప్రభుత్వం కేరళకు అందించవలసిన తక్షణ సాయం విషయంలో తగినంత ఉదారంగా లేదనిపిస్తుంది. జాతీయవిూడియాగా పిలుచుకునే ఉత్తరాది విూడియా దృష్టిలో కేరళ విపత్తు పెద్ద వార్తే కాకపోవడం మరో విషాదం. ఉత్తరాది రాష్ట్రప్రభుత్వాల స్పందన తగినంత లేదనే విమర్శ వినిపిస్తోంది. 25 కోట్ల రూపాయల సహాయంతో పాటు ఆహారవస్తు సామగ్రిని కూడా అందించిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అభినందనీయం. దేవుడి సొంతనేలగా ప్రసిద్ధమయిన కేరళ, మానవతప్పిదాల వల్లనే అకాల ప్రళయాన్ని అనుభవించవలసి వస్తున్నది. 2005లో ముంబై, మహారాష్ట్ర, 2007లో అస్సాం బిహార్‌, యుపి, 2009లో ఆంధప్రదేశ్‌, 2013లో ఉత్తరాఖండ్‌, 2014లో కశ్మీర్‌, 2015లో చెన్నై, 2017లో గుజరాత్‌, ఇప్పుడు కేరళ.. వర్షభీభత్సాన్ని చవిచూశాయి. ప్రతి వైపరీత్యం తరువాత, ఒక అధ్యయన సంఘాన్ని నియమించడం, దాని నివేదికను బుట్టదాఖలు చేయడం ఆనవాయితీగా మారింది. ప్రకృతి నియమాలతో చెలగాటమాడడం వల్లనే ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నా దానిని అడ్డుకోవడం లేదు. ఒక పద్ధతీ పాడూ లేని పట్టణీకరణ, నదుల ప్రవాహమార్గాలను అడ్డుకునే రీతిలో నిర్మాణాలు చేయడం, భూవినియోగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో మార్చడం, వరదలు వచ్చినప్పుడు నీటిమట్టాలు పెరగకుండా నిరోధించే మైదానప్రాంతాలను నిర్మాణాలతో నింపివేయడం? ఇవన్నీ వరదలకు కారణాలే. నీరు పల్లమెరుగు. పల్లాన్ని అడ్డుకుంటే, మట్టం పెరుగుతుంది. నీరు పారిపోయే దారిలేకపోతే, ఒత్తిడి పెరుగుతుంది, చల్లటి నీరే ఖడ్గంలా నేలను కోసివేస్తుంది, మహానిర్మాణాలను కూల్చివేస్తుంది.1924 నుంచి ఇప్పటిదాకా కేరళలో వచ్చిన దాదాపు వంద వరదల్లో ఇదే పెద్దది. 1924 నాటి ఉపద్రవం కంటెవర్షపాతంలో చిన్నది కానీ, నష్టంలో పెద్దది. నాడు మూడు వారాల వ్యవధిలో 337 సెంటీవిూటర్ల వర్షం పడితే, ఈసారి జులై ఒకటి నుంచి పడిన వర్షం మొత్తం 200 సెంటీవిూటర్లు మాత్రమే. కేరళలోనే కాదు, యావత్‌ భారతదేశంలోనూ వరదలను తట్టుకోగలిగే శక్తి తగ్గిపోతున్నది. ఒకనాడు కుండపోతకు కకావికలమయ్యే నగరాలు నేడు ఒకమోస్తరు వర్షానికి కూడా విలవిలలాడుతున్నాయి. ఇందుకు కారణం ప్రకృతి విధ్వంసం అన్న సంగతి గుర్తెరగాలి. ఈ దేశంలోని వాతావరణంలో విద్వేషం, తామసప్రవృత్తి పెరుగుతున్నాయని బాధపడుతున్నవారికి, ఆ ధోరణులు ఏ స్థాయికి చేరాయో కేరళ వరదలు సూచిస్తున్నాయి. తోటివారికి కలిగిన కష్టనష్టాలకు కన్నీటితో పాటు చేయూత కూడా అందించాలని అత్యధికులు ఇంకా భావిస్తున్నారు. కేరళను ముంచెత్తిన వరదల కారణంగా ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందారు. దీంతో తీవ్రమైన విపత్తుగా కేంద్రం ప్రకటించింది. ఈనెల 8న కేరళలో పర్యటించిన కేంద్ర బృందం వరదల విస్తృతి, తీవ్రత పరిశీలించి తీవ్ర విపత్తుగా నిర్ణయించింది. కేరళకు జాతీయ విపత్తు నిధి నుంచి కేంద్రం సాయం అందించనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అదనంగా మరికొన్ని నిధులు అందించనుంది. భారీ వరదల ధాటికి కేరళలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. అధికారులను రంగంలోకి దింపింది. కేరళలో వర్షాలు తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న ఇళ్ల పరిస్థితిని చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. కట్టుబట్టలు తప్ప ఏవిూ మిగల్లేదని ఆవేదన చెందుతున్నారు.