ప్రకృతి విధ్వంసంతోనే భానుడి భగభగలు
చండప్రచండంగా భానుడు చెలరేగి పోతున్నాడు. ఉదయం ఆరు గంటలకు మొదలవుతున్న సూర్య ప్రతాపం మళ్లీ తెల్లారే సరికి ఉంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే మండే ఎండలు దంచి కొడుతున్నాయి. మన చేజేతులారా ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన కారణంగా ఇలాంటి ఎండలను చవిచూడాల్సి వస్తోంది. విపరీతంగా చెట్లను నరికివేసిన,కొండలను కొల్లగొట్టిన, అడవులను తెగనరికిన, ఇసుకను ఎత్తేసి వాగులను ధ్వంస చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అయితే ఇదంతా గ్రహించకుండా ఇంకా మనం కాలం మారిందంటూ వేదంతా ధోరణిలో మాట్లాడడం సరికాదు. మన చేస్తున్న వాతావరణ విధ్వంసాన్ని గుర్తించాలి. చేజేతులా ప్రకృతి విధ్వంసం వల్లనే ఇలా ఎండలు మండుతున్నా యని గుర్తుంచుకోవాలి. అతివృష్టి లేదా అనావృష్టికి కూడా ప్రకృతి విధ్వంసమే కారణమని గ్రహించాలి. ఒక్క సారిగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో వేసవి కాలం పూర్తిగా రాకముందే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో వడదెబ్బలకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. రోహిణీ కార్తె వచ్చినపుడు రోళ్లు బద్దలయ్యే ఎండలు ఉంటాయని అంటారు. అంతకుముందే రోళ్లు బద్దలవుతున్నాయి. ఇంకా వేసవి కాలం పూర్తిగా రాకముందే ఇంత ఎండ తీవ్రతను భరించడం కష్టంగా మారింది. ప్రాణాలు హరిస్తున్న ఎండలు మార్చిలోనే మొదలైతే మే నెల వరకూ ఎలా బతికేది అనే ఆందోళన అందరిలో తొంగి చూస్తున్నది. తొలకరి పలకరించే వరకూ తాగేందుకు నీళ్లు ఎలా లభమౌతాయనే ప్రశ్న కూడా ఉదయిస్తున్నది. పంటల సంగతి అటుంచి పశువులను అప్పటి వరకూ బతికించుకోవడం ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విధ్వం వల్ల విపరీత పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయని మనం గ్రహించలేకపోతున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం, రసాయన ఎరువు వాడకం తదితర కారణౄలతో భూమి వేడెక్కుతోంది. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటడంతో వేడి మరింతగా పెరుగతోంది. మార్చి నెలలోనే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. గత రెండు రోజుల్లోనే అకస్మాత్తుగా మూడు నుంచి ఆరు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరగడంతో సామాన్యుడు తాళలేకపోతున్నాడు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకూ, కోస్తా ఆంధ్రాలోనూ, రాయలసీమలోనూ, తెలంగాణా అంతటా ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని అందుతున్న హెచ్చరికలు వింటుంటే మరింత ఉత్పాతం సంభవించబోతున్నదనే ఆందోళన కలుగుతుంది. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తల్లడిల్లి పోతున్నారు. ఇంట్లో నుండి బయకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సరాసరి ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగింది. భానుడి ప్రతాపానికి పగటి వేళ ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదౌతున్నది. వడదెబ్బ కారణంగా సంభవిస్తున్న మరణాలు పెరిగిపోతున్నాయి. వాయువ్య, మధ్యభారతం నుంచి పొడి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అన్ని పట్టణాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది. ప్రకృతి ప్రకోపించినపుడు దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఎండల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతల ధాటికి జనం విలవిల లాడిపోతున్నారు. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రయినా తగ్గకపోవడంతో ఇప్పటికే చాలా చోట్ల వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగిపోతున్నది. అకస్మాత్తుగా పెరిగిన ఎండలు మరిన్న ప్రాణాలు తీయకముందే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పంటలను, పశువులను కాపాడుకుంటూ జనానికి తగిన భద్రత కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. భానుడి ప్రతాపం రోజురోజుకు పెరిగిపోవడంతో సామాన్యల బతుకు దుర్భరంగా మారుతోంది. గతపదిహేను రోజులుగా ఏమాత్రం తగ్గకుండా ఎండల వేడిమి పెరుగుతూనే ఉంది. రోజూ ఎండలు మండుతుండటంతో ప్రజా జీవనం స్తంభించిపోతోంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. విపరీతమైన ఎండలతో రేడియేషన్ పంజా విసురుతోంది. అతినీల లోహిత కిరణాలు విరుచుకు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి చివర్లోనే ఈ సూచిక ఏకంగా 12కు చేరుకోవడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ పట్టుకుంది. ఇలాంటి తరుణంలో జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్తే అతినీల లోహిత కిరణాలతో చర్మ, కళ్ల రుగ్మతలే కాకుండా క్యాన్సర్ బారిన పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడి నుంచి వచ్చే ఎండ వేడిలో శక్తిమంతమైన అతినీల లోహిత కిరణాలు(అల్టా వైలెట్ రేస్) ఉంటాయి. ఇతర కాలాలతో పోలిస్తే వీటి తీవ్రత ఎండాకాలంలో ఎక్కువ. ఇవి నేరుగా మనిషి శరీరంలోకి చొచ్చుకుపోతాయి. సూరీడు తన ప్రతాపాన్ని మరింత చూపే ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలను సహజంగా వాతావరణంలోని స్టాట్రోస్పియర్‌లో ఉండే ఓజోన్ పొర అడ్డుకుంటుంది. దాని మందం తగ్గితే ఈ కిరణాలు భూమిని తాకుతాయి. ఓజోన్ పొర మందం ఎక్కువగా ఉంటే మంచిది. అది ఇటీవల కాలంలో పూర్వస్థితికి చేరుకుంటోందని పరిశోధనలు చెబుతున్నా.. రేడియేషన్ తీవ్రత ఎందుకు ఎక్కువగా ఉంటుందో అంతుబట్టడం లేదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రకృతి పరంగా సాగుతున్న విధ్వంసం ఈ అనర్థాలకు మూలమని హెచ్చరిస్తున్నారు.