ప్రకృతి సేద్యంలో.. ఏపీ వైపే ప్రపంచం దృష్టి
– ప్రకృతిని, సాంకేతికతను సమర్థంగా వినియోగించడమే మన ఘనత
– ఐరాసలో ఏపీకి మంచి గుర్తింపు లభించింది
– రాష్ట్ర వ్యాప్తంగా 19శాతం లోటు వర్షపాతం ఉంది
– సమర్థ నీటి వినియోగమే అన్ని సమస్యలకు పరిష్కారం
– రబీ విత్తనాల పంపిణీపై దృష్టిపెట్టాలి
– పశుగణనను సమర్థవంతంగా పూర్తిచేయాలి
– ‘యువనేస్తం’ పథకాన్ని విజయవంతం చేయాలి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబర్1(జనంసాక్షి) : ఏపీ సాగవుతున్న ప్రకృతి సేద్యం ప్రపంచానికే నమూనా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. ‘నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతి’పై చంద్రబాబు నాయుడు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ ప్రకృతి సేద్యం వైపు చూస్తోందని, ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రానికి మంచి గుర్తింపు లభించిందని సీఎం అన్నారు. అటు ప్రకృతి, ఇటు సాంకేతికత.. రెండింటినీ సమర్థంగా వినియోగించడమే ఏపి ఘనత అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ముందున్నామని, ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపి కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19శాతం వర్షపాతంలోటు ఉందని, సీమ జిల్లాల్లో 45శాతం లోటు నమోదైందన్నారు. సమర్థ నీటి వినియోగమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం పేర్కొన్నారు. రబీ విత్తనాల పంపిణీపై శ్రద్దపెట్టాలని, ఖరీఫ్ దిగుబడి ముందస్తు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఉపాధిహావిూ పనులను సమర్థవంతంగా నిర్వహించామని, 15.7 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని, రూ.4,893 కోట్ల నిధుల వినియోగం జరిగిందన్నారు. ఇంకా 7వేల కోట్ల నిధులను వినియోగించుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబర్ 1నుంచి డిసెంబర్ 30 వరకు పశుగణనను విజయవంతం చేయాలన్నారు. పశుగ్రాస కొరత లేకుండా చూడాలని, ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేయాలన్నారు. పాడి దిగుబడులు తగ్గకుండా దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పచ్చగడ్డి, ఎండుగడ్డి, సైలేజ్, సంపూర్ణ మిశ్రమదాణా పంపిణీ చేయాలన్నారు. కడప, శ్రీకాకుళం, అనంతపురం, విజయనగరం, ప్రకాశం జిల్లాలలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు 600కోట్ల రూపాయలు వినియోగించాలన్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ విజయవంతం చేయాలని అధికారులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎల్లుండికల్లా ఖాతాలలో 1,000 రూపాయలు జమచేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో వ్యాధుల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.