ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి

– దాడి ఎందుకు చేశానో పుస్తకంలో రాశాను

– ఆ పుస్తకాన్ని జైలు అధికారులు తీసుకున్నారు

– జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావు

– శ్రీనివాస్‌ను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చిన అధికారులు

– ఈనెల 23వరకు రిమాండ్‌ విధించిన ఎన్‌ఐఏ కోర్టు

– ప్రత్యేక భద్రత మధ్య రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఆదేశం

విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : ఎందుకు చేశానో ప్రజలకు చెప్పే అవకాశం ఇవ్వండని నిందితుడు శ్రీనివాస్‌ రావు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టును కోరాడు. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో శుక్రవారం జగన్‌ పై దాడి చేసిన శ్రీనివాసరావుని అధికారులు హాజరుపరిచారు. ‘నా భావాలు ప్రజలకి చెప్పాలని, ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటూ కోరాడు. నేను ఎందుకు ఈ పని చేశానో ప్రజలకు చెబుతానని, నేను చేసిన ఈ పనిని అనవసరంగా రాజకీయ వివాదం చేస్తున్నారని పేర్కొన్నాడు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. నేను జైల్లో రాసుకున్న పుస్తకంని నాకు ఇప్పించండని నిందితుడు శ్రీనివాసరావు కోర్టుని కోరాడు. 22పేజీల పుస్తకంలో జగన్‌ పై దాడి ఎందుకు చేశానో అంతా వివరంగా రాశానని, అందుకే ఈ ఘటనపై నేను ప్రజలకి వాస్తవం చెప్పే అవకాశం ఇవ్వండంటూ ఆ పుస్తకాన్ని అక్కడి జైలు అధికారులు తీసుకున్నారని శ్రీనివాసరావు కోర్టుకి తెలిపాడు. ఆ లేఖను తనకు

ఇప్పించాలని కోరాడు. అయితే శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కాగా తనకు ప్రాణహాని లేదని నిందితుడు శ్రీనివాసరావు న్యాయమూర్తికి తెలిపాడు. అంతకుముందు శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఇదిలాఉంటే జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు విచారణలో కోర్టు ఆదేశాలను ఎన్‌ఐఏ ఉల్లంఘించిందని నిందితుడి తరఫున న్యాయవాది మట్టా జయశంకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు సమాచారం లేకుండా నిందితుడిని విచారించారని న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాసరావును 30 గంటల పాటు ఎందుకు విచారించారని ఆయన వాదించారు. విజయవాడ కారాగారంలో నిందితుడికి ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జైలులో తోటి ఖైదీలను కూడా నిందితుడి వద్దకు వెళ్లనీయవద్దని ఆయన కోరారు. ఇదిలాఉంటే జగన్‌ కేసు నిందితుడు శ్రీనివాసరావుని రాజమహేంద్రవరం జైలుకి తరలించాలని ఎన్‌ఐఏ కోర్ట్‌ ఆదేశించింది. విజయవాడ జైల్లో భద్రత లేదని , ప్రాణహాని ఉందని అతని తరఫు న్యాయవాదుల వాదనను న్యాయస్థానం అంగీకరించింది. ప్రత్యేక భద్రత మధ్య రాజమహేంద్రవరం జైలుకి తరలించాలని ఆదేశించిన ఎన్‌ఐఏ కోర్ట్‌, ఈ నెల 23 వరకూ రిమాండ్‌ విధించింది.