ప్రజలపై భారం మోపేలా పన్నుల వడ్డింపు

 

భారంగా మారనున్న ఆస్తిపన్ను పెంపు

దశలవారీ ఆందోళనలు చేస్తామన్న పౌరసమాఖ్య

విజయవాడ,నవంబర్‌16(జనం సాక్షి ): హైకోర్టులో వివాదంలో ఉన్న ఆస్తిపన్నుల పెంపుపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకుండానే పన్నులపై ప్రజలకు నోటీసులు ఇవ్వడం న్యాయ వ్యవస్థను ధిక్కరించనట్లేనని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌరసమాఖ్య  రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు. ఆస్తివిలువ ప్రాతిపదికన పన్నులపై ఎపియుసిఎఫ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని, అది తేలకుండా పన్నులు కట్టాలని నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆస్తి పన్నును ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ పన్నులపై రాతపూర్వక అభ్యంతర పత్రాలు అధికారులకు ఇవ్వాలని కోరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాన్ని మోపడంపైనే దృష్టిపెట్టాయని, దీనిలో భాగమే ఆస్తివిలువ ఆధారిత పన్ను అన్నారు. దీనికోసం చట్ట సవరణలు, జిఒలు విడుదల చేసి ప్రజలపై పన్ను భారాలు మోపుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 200 నుండి 400శాతం వరకు పన్నులు పెంచుతూ ప్రజలకు నోటీసులు అందాయని అన్నారు.  పట్టణ పౌరసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆస్తి పన్ను పెంపు, ఇతర పన్నులపై దశలవారీ ఆందోళనలు చేపడతామని తెలిపారు.  1.5కోట్ల మంది పట్టణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు భారాన్ని మోపుతోందన్నారు. 15శాతమే పన్ను పెంచుతున్నామని ప్రభుత్వం, మంత్రులు బూటకపు మాటలతో ప్రజలను మాయ చేస్తున్నారని, దీన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. కొత్తగా కట్టే ఇళ్లకు పెంచిన పన్నులతో ఇంటి పన్నుల నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా 15శాతంతో మొదలుపెట్టి, 200 నుండి 300 శాతానికి ఆస్తిపన్నులు పెంచుతోందని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆస్తిపన్నుపై దశలవారీగా ప్రజాపోరాటం, న్యాయపోరాటం కొనసాగిస్తామని అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఉందని, దీనిలో భాగంగా చెత్తసేకరణ, పారిశుధ్యం ప్రభుత్వమే చేయాలని అన్నారు. దీనికోసం ప్రతినెల రూ.120 వసూలు చేయడం అన్యాయమని తెలిపారు. చెత్తపన్నును ప్రజలు ప్రతిఘటిస్తున్నారని పేర్కొన్నారు.