ప్రజలు మరింత ఉధృతంగా ఉద్యమించాలి
ఆదిలాబాద్, అక్టోబర్ 18 (ఎపిఇఎంఎస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం లేదని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలే దీక్షలు గురువారంనాటికి 1019వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఐకాస నేతలు మాట్లాడుతూ, ప్రజలు మౌనం వీడి ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీల అనెకేతను ఆసరా తీసుకుని కేంద్రం ప్రజల ఆకాంక్షతో చెలగాటం ఆడుతుందని దుయ్యబట్టారు. చర్చలతో, సమావేశాలతో రాష్ట్రం ఏర్పాటు కాదని ఉద్యమం ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు కేంద్రం స్పష్టమైన ప్రకటన పండుగలోగా ప్రకటించకపోతే పోరాటం తప్పదని వారు హెచ్చరించారు.