ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ! పాలకుల పరిష్కారలోపమా..! అధికారుల అలసత్వమా..?

ప్రజల ప్రాణాలతో చెలగాటం.. !పాలకుల పరిష్కారలోపమా..! అధికారుల అలసత్వమా..?

బోనకల్, సెప్టెంబర్ 23 (జనం సాక్షి):
బోనకల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై గుంటలు ఏర్పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అసలే రహదారులపై గుంటలతో వణికిపోతున్న వాహనదారులకు వర్షాలతో ఆ గుంటలలో వర్షపు నీరు నిండి ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రజల ప్రాణాలు పోతే గాని పాలకులు పట్టించుకోరా అని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనకల్ మండల కేంద్రం నుండి ఖమ్మం వరకు రహదారుల సమస్య అధికంగా ఉందని ఎన్ని సార్లు అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు గోడు విన్నవించుకున్నా ప్రయోజనం లేదు అంటున్నారు మండలవాసులు. నిత్యం బోనకల్ పరిసర ప్రాంతాల నుండి నిత్యం వివిధ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రమైన ఖమ్మం కు వందలాదిమంది వెళ్లి వస్తూ ఉంటారు. ఈ రహదారిపై ఏర్పడిన గుంటల వలన ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్న ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అధికారులు తూతూమంత్రంగా హడావిడి చేస్తారని ఆ తర్వాత నెలలు గడుస్తున్నా రోడ్ల సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని మండలవాసులు మండిపడుతున్నారు. అదే నాయకుల పర్యటనలు ఉంటే తాత్కాలిక మరమ్మతులు చేసి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రతిరోజు రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు ఈ రహదారి గుండా మండల కేంద్రంలో తిరుగుతూనే ఉంటారు. రోడ్ల పరిస్థితి వర్షాకాలం వస్తే మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని అపాఖ్యాతి ప్రజా ప్రతినిధులు,నాయకులు మూటకట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లపై ఉన్న గుంతలకు తాత్కాలిక మరమ్మత్తులైన చేసి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిందిగా ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు.