ప్రజల వద్దకే బ్యాంకులు…. అదనపు కలెక్టర్ రాజర్షి షా బ్యాంకింగ్ అవుట్ రీచ్ సంగారెడ్డి టౌన్ జనం సాక్షి

ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం  సంగారెడ్డి ఎక్స్ రోడ్ లోని రైతు వేదికలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంకింగ్ అవుట్ రీచ్  కార్యక్రమంలో  వివిధ బ్యాంకులు పాల్గొని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అట్టి స్టాల్స్ ని రాజర్షి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఆర్థికంగా చేయూత నివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయని, బ్యాంక్ ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.బ్యాంకులు వివిధ రకాల రుణ సదుపాయాలను కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలలో ఆయా లబ్ధిదారులకు రుణాలు సత్వరమే అందించేలా బ్యాంకులు కృషిచేయాలని ఆయన కోరారు. బ్యాంకులు ఎన్నో రకాల రుణాలు అందిస్తున్నాయని వాటికి సంబంధించిన పూర్తి అవగాహనతో రుణం పొందడంతోపాటు అన్ని విధాల సద్వినియోగం చేసుకోవాలన్నారు . తిరిగి బ్యాంకు రుణం చెల్లించడం లోనూ లబ్ధిదారులు ముందుండా లన్నారు.జిల్లాలో బ్యాంకర్ల తో ఎంతో సక్సెస్ అయ్యామని,  గత సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు నిర్దేశిత లక్ష్యాన్ని మించి 672 కోట్ల 58 లక్షల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు  అందించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేందుకు బ్యాంకులు  అందించిన సహకారాన్ని ఆయన గుర్తు చేస్తూ  బ్యాంకర్లను  అభినందించారు. పీఎం స్వనిధి క్రింద వీధి వర్తకులకు అందించిన రుణాలలో  సంగారెడ్డి ,జహీరాబాద్ మున్సిపాలిటీలు దేశంలోనే టాప్  పొజిషన్ లో నిలిచాయని తెలిపారు. అందుకు సహకరించిన బ్యాంకర్లను ఆయన  ఈ సందర్భంగా అభినందించారు.అన్ని వర్గాల ప్రజలు బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. అవుట్ రీచ్ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాలను అందించారు. అందులో స్వయం సహాయక సంఘాల కు బ్యాంకు లింకేజీ కింద కోటి 86 లక్షలు, స్వయం ఉపాధి కింద (లాంగ్ టర్మ్ డైరీ షీప్) 55 లక్షలు , విద్యారుణం గా జి. కౌశిక్ అనే విద్యార్థికి 65 లక్షల  రూపాయల చెక్కులను అందించారు.ఆయా బ్యాంకులు ఏర్పాటుచేసిన స్టాల్లల్లో ప్రజలు ఆయా బ్యాంకులు అందిస్తున్న రుణాలు, ఆయా పథకాల గురించి,  వివిధ రుణాలు, వడ్డీ తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం. గోపాల్ రెడ్డి , కెనరా బ్యాంక్ ఏజీఎం ఆర్. శ్రీనివాసరావు, , నాబార్డ్
 డి డి యం కృష్ణ తేజ, ఎస్బిఐ రీజినల్ హెడ్ కళ్యాణ్, డి ఆర్ ఎమ్ యు బి ఐ విజయ సారథి, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ పి. రాజు, వివిధ బ్యాంకుల బ్యాంకర్లు,  సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.