‘ప్రజాభిప్రాయం ముఖ్యం …. పాకిస్థాన్‌తో పని లేదు’
న్యూఢిల్లీ : భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుపై పాకిస్థాన్ అభ్యంతరాలను పట్టించుకునేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ భారతదేశ భౌగోళిక పరిస్థితిని సక్రమంగా చూపించేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపారు. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్లు, 2016పై పాకిస్థాన్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేది లేదని పేర్కొన్నారు. ప్రజలు, నిపుణులు, వివిధ భాగస్వాములు అందించే సలహాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, బిల్లుకు తుదిరూపం ఇస్తామని తెలిపారు.
పాకిస్థాన్ ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీరును భారతదేశంలో భాగంగా చూపడం అంతర్జాతీయ చట్టాలకు, ఐరాస తీర్మానాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ బిల్లు ప్రతిపాదనల ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా ముద్రించిన, ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థలకు రూ.100 కోట్ల జరిమానా, గరిష్ఠంగా ఏడేళ్ళ జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.