ప్రజా జీవితంలోనే ఉంటా
ఏ రాజకీయపార్టీలోనూ చేరను: యశ్వంత్ సిన్హా
పాట్నా,జూలై26(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తృణమూల్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు..నాతో ఎవరూ మాట్లాడలేదు..నేను ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చారు. ’నేను ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తానో, ఎంత యాక్టివ్‌గా ఉంటానో చూడాలి. నాకు ఇప్పుడు 84 ఏళ్లు, కాబట్టి నేను ఎంతకాలం ప్రజాజీవితంలో కొనసాగుతానో చూడాలని అన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము చేతిలో యశ్వంత్ సిన్హా ఓడిపోయారు. 1984లో ఐఏఎస్ కు రాజీనామా చేసి జనతా పార్టీలో చేరినసిన్హా 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఆయన..1998,1999,2009లో హజీరాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2002లో కేంద్ర విదేశంగ మంత్రిగా పనిచేశారు. ఇక బీజేపీ నుండి బయటకు వచ్చిన ఆయన గతేడాది తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.