ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
ఆదిలాబాద్, డిసెంబర్ 7: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికారాన్ని నిలుపుకునేందుకు పాకులాడుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అయిన శుక్రవారం ముథోల్ నియోజకవర్గంలో బేగామాలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర లేక, రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు సతమతమవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఈ పాదయాత్ర చేపట్టానని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలు కలుషితమైనందున యువకులు రాజకీయ రంగంలోకి వచ్చి దీనిని నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపానని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతులకు రుణాలను మాఫీ చేయడంతో పాటు 7గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు అన్ని విధాల ఉపాధి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణను వ్యతిరేకించలేదని, అఖిల పక్షం సమావేశంలో తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామన్నారు. చంద్రబాబు తన పాదయాత్రలో, తన తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ రైతులకు, యువతకు పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాధోడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేశ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.