ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

జనంసాక్షి , మంథని : ప్రజల నుంచి వచ్చే అర్జీలలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. సోమవారం మంథని మండలం తహాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని తహాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనీ తెలిపారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. డివిజన్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 104 దరఖాస్తులు వచ్చాయని వీటిలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి 67 దరఖాస్తులు మిగిలిన శాఖలకు సంబంధించిన 37 సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారని అదనపు కలెక్టర్ తెలిపారు. మంథని పట్టణానికి చెందిన అజ్మత్ ఖాన్ తన తల్లి కరోనాతో మరణించారని, ప్రభుత్వ సహాయం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన బోడలత ధర్యాపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 118ఇ/2/1 లో ఎకరం 30 గుంటల భూమి ఉందని, ఆ భూమిలో 17 ఆర్. కెనాల్ కు 0.25 గుంట భూమి పోయిందని, ఇట్టి విషయం పరిష్కరించాలని అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ముత్తారం తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన పెట్టెమ్ రవి గ్రామంలోని సర్వే నెంబర్ 544, 545 లో తమకు మూడు ఎకరాల 8 గంటల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టిన కారణంగా తమకు నష్టం వాటిల్లుతుందని, అక్రమ మట్టిరవాణా దారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఏడి మైనింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు.
మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐ. ప్రసాద్ ఇసుక రీచుల కారణంగా మరమత్తుకు గురైన రహదారులను వెంటనే మరమ్మత్తు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయగా, ఏడి మైన్స్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, డివిజన్ పరిపాలన అధికారి తూము రవీందర్, సర్వే ల్యాండ్ రికార్డ్ డి ఐ విజయ శంకర్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.