ప్రజా సమస్యల పరిష్కారంలో..  కలిగే సంతృప్తేవేరు


– జన్మభూమికి అద్భుత స్పందన వస్తుంది
– ఫిర్యాదులకు పదిరోజుల్లో పరిష్కారం చూపండి
– కేంద్రం నిర్లక్ష్యంతో ఉపాధి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది
– అధికారులు, నేతలు గ్రామాల్లో ప్రజలకు వివరించండి
– చుక్కల భూమి సమస్యలకు పరిష్కారం చూపండి
– టెలీ కాన్ఫరెన్స్‌ అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి3(జ‌నంసాక్షి) : ప్రజా సమస్యలను పరిష్కరిస్తే.. అందులో కలిగే సంతృప్తి వేరని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్దచూపి, వారి సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలో గురువారం ‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమంపై చంద్రబాబు కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మభూమి కార్యక్రమానికి తొలిరోజే అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారనీ, వారిలో పెరిగిన చైతన్యానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. జన్మభూమిపై ప్రజల్లో 78శాతం సంతృప్తి నెలకొంది. ప్రజలకు ఓపికగా సమాధానం చెప్పి ప్రజల్లో నమ్మకం కలిగించాలని సూచించారు. ఈ సమావేశాల్లో పాల్గొనే ఫిర్యాదుదారుల్లో బాధ ఉంటుందనీ, నేతలు అధికారులు దీన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని అన్నారు. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉపాధి హవిూ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని సీఎం విమర్శించారు. దీన్ని అధికారులు, నేతలు గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. చుక్కల భూమి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
జన్మభూమి తొలిరోజు 18,527ఫిర్యాదులు వచ్చాయని, పౌర సరఫరాలపై 4వేలు, రెవిన్యూలో 3వేల ఫిర్యాదులు వచ్చాయని, సాధ్యమైనన్ని ఫిర్యాదులు పది రోజుల్లోనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ సంకల్పమని, తర్వాతి దశకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఫిర్యాదు దారుల్లో బాధ ఉంటుందని, వాళ్ల బాధలను మనం అర్ధం చేసుకోవాలని, సత్వరమే సమస్యలను పరిష్కరిస్తే.. ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుందని సీఎం చెప్పుకొచ్చారు. గ్రామాలు, వార్డుల అభివృద్ధే మన లక్ష్యం, పేదల సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం, తరువాత దశకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతపురం జిల్లా కోమటికుంట గ్రామ  సమస్యలు పరిష్కరించాలని
అధికారులను చంద్రబాబు ఆదేశించారు.