ప్రణాళిక ప్రకారమే..  జగన్‌పై హత్యాయత్నం


– డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు
– సంఘీభావం తెలిపిన పార్టీలపై చంద్రబాబు మండిపడ్డారు
– వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
– జగన్‌ భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదు
– త్వరలోనే పాదయాత్ర మొదలవుతుంది
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్ర దాగుందని, ఓపక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు అనుమానాలున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో వైసీపీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాణాలు తీసేందుకు తనపై దాడిచేసిన శ్రీనివాసరావుపై దాడి చేయవద్దని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సూచించారని వైసీపీ సీనియర్‌ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. నిందితుడిని పోలీసులకు అప్పగించాలని తమ అధినేత చెప్పారన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రథమ చికిత్స తీసుకున్నాక జగన్‌ హైదరాబాద్‌ కు వెళ్లారనీ, అక్కడ న్యూరో సిటీ ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. జగన్‌ పై మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో జగన్‌ పై దాడి జరిగితే, 2గంటలకు జగన్‌పై దాడిచేసింది ఆయన అభిమానేనని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ప్రకటన విడుదల చేశారని సాయిరెడ్డి తెలిపారు. సాధారణంగా నిందితుడి పేరు, ఇతర వివరాలను బయటపెట్టరనీ, కానీ ఈ ఘటనలో మాత్రం డీజీపీ నిందితుడి పేరుతో పాటు కులం వివరాలను కూడా బయటపెట్టారని వెల్లడించారు. ఇది నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే జగన్‌పై హత్యాయత్నం వెనుక పెద్దకుట్ర దాగుందని విజయ సాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే కొందరు వ్యక్తులు కావాలనే జగన్‌ పై హత్యాయత్నం చేయించినట్లు అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. నిందితుడు శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్త అని చూపేలా టీడీపీ కార్యాలయం విూడియా సంస్థలకు నకిలీ ప్లెక్సీలను విడుదల చేసిందన్నారు. జగన్‌ పై దాడిని ఖండించిన జనసేన, టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలపై టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2003లో చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనను తెలుసుకున్న వెంటనే అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖరరెడ్డి తిరుపతికి వెళ్లి ధర్నాకు దిగారని గుర్తుచేశారు. ఇక్కడ జగన్‌ పై దాడి జరిగాక, చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే నిజానిజాలు పూర్తిగా మరుగన పడిపోతాయని, కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ జరపాలని, అలా అయితేనే టీడీపీ నేతల కుట్రలు, దాడిలో వారి ప్రమేయం
ఎంత వరకు ఉందనేది బయటకు వస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
త్వరలోనే పాదయాత్ర మొదలవుతుంది -బొత్స
ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఆలోచన తమకు లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని వెల్లడించారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు తామేమి ఏపీలో రాష్ట్రపతి పాలన కోసం కుట్ర చేయడం లేదని స్పష్టం చేశారు. జగన్‌ పై దాడి జరగగానే నిందితుడిని తొలుత సీఐఎస్‌ఎఫ్‌ పట్టుకుని పోలీసులకు అప్పగించిందనీ, అధికారులు సైతం అప్పుడే కేసు నమోదుచేశారని తెలిపారు. కత్తి దాడితో భయపడిపోయి జగన్‌ ఇంట్లో కూర్చునే రకం కాదనీ, త్వరలోనే కోలుకుని ఆయన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటారని వెల్లడించారు. జగన్‌ పై దాడి ఘటనలో రాష్ట్ర డీజీపీ తీరు అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీతో విచారణ జరపాలనీ, కుదరకుంటే హైకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్‌ చేశారు.