ప్రతి గింజా కొనాల్సిందే


` ‘మన ఊరు` మన పోరు ‘ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి
ఎల్లారెడ్డి,మార్చి 20(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజకొనే వరకూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘మన ఊరు` మన పోరు ‘ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ఏప్రిల్‌ నెల నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే రైతులతో కలిసి ఫామ్‌ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెరాసకు రెండు సార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపి దిల్లీ వెళ్లి పోరాడతానని కేసీఆర్‌ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌ జిల్లాలో చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హావిూ ఇచ్చిన కవిత ఎంపీగా గెలవగానే ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు.పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌పై రాసిచ్చిన భాజపా ఎంపీ అర్వింద్‌ ఇచ్చిన హావిూని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపుబోర్డు రాక పసుపు రైతులు, గిట్టు బాటు ధరలేక ఎర్రజొన్న రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రూ.2.5లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో రూ.10వేల కోట్లు పెట్టి ధాన్యం కొనలేరా? అని ప్రశ్నించారు. నెపం కేంద్రంపై నెట్టి మరోసారి దిల్లీలో అగ్గి పుట్టిస్తానని కేసీఆర్‌ బయలుదేరుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనకుంటే రైతులతో కలిసి దండుకట్టి ఉద్యమిస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పండిరచిన ధాన్యాన్ని ఎలా కొంటారో.. పేద రైతులు పండిరచిన వడ్లను ఎలా కొనరో చూస్తామని హెచ్చరించారు. పోడు భూముల సమస్య, తెరాస, భాజపా విధానాలపై ఇతర నేతలు విమర్శలు గుప్పించారు. పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ అధ్యక్షతన జరిగిన సభలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, మదన్‌ మోహన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు సభకు భారీగా తరలివచ్చారు.

తాజావార్తలు