ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేస్తాం
కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకోలేరు: దేవినేని
విజయవాడ,ఆగస్ట్4(జనం సాక్షి): పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమ పట్నంల గురించి తెలియనరి వారు విమర్వలు చేయడం విడ్డూరంగా ఉందని జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టుల కోసం అహరహరం కృషి చేస్తున్న ఘనత తమదని అన్నారు. కొందరు ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తూ రెచ్చగొట్టినా ప్రజలు పూర్తిగా సహకరించడం వల్లనే భూసేకరణ సజావుగా సాగిందని అన్నారు. అలాగే ప్రజల్లో అవగాహన పెరుగుతోందని అన్నారు. ఇటీవలి పట్టిసీమ, పురుషోత్తమ పట్నం తరవాత తాజాగా మచ్చుమర్రి ఎత్తిపోతలతో ఆయకట్టు రైతాంగంలో చంద్రబాబు భరోసా నింపారని అన్నారు. తాము అభివృద్ధి చేస్తుంటే వైకాపా కావాలనే రాజకీయ దురుద్దేశ్యంతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న యోచనతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు వివరించారు. వర్షాభావ ప్రాంతాల్లో ప్రతి ఎకరాకూ బిందు, తుంపర సేద్యం ద్వారా వ్యవసాయం చేసేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
పోలవరాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. సిఎం చంద్రబాబు ప్రకటించినట్లుగా పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్నారు. లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికి చంద్రబాబు ప్రాజెక్టుల విషయంలో రాజీపడడం లేదన్నారు. అన్ని జలాశయాలకు నీళ్లివ్వడానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. కృష్ణా జలాలు మనకు రానీయకుండా మహారాష్ట్ర, కర్ణాటక నిలిపేశాయని అన్నారు. కృష్టా ట్రైబ్యునల్ వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం మిగులు జలాల్లో తమకు హక్కు అవసరం లేదని
రాసిచ్చిందని గుర్తుచేశారు. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. నీటి ఇక్కట్లను అధిగమించడానికి భూగర్భజలాలు పెంచుకునేందుకు భగీరథ యత్నం చేస్తున్నామని తెలిపారు. 40 వేల చెరువులు, 50 వేల చెక్‌డ్యాంలు, 16 లక్షల బోర్లు, ఆరున్నర లక్షల పంటకుంటలు తవ్వామని గుర్తుచేశారు. హంద్రీనీవా వెడల్పు చేస్తున్నామని, ఈ ఏడాదే మడకశిర, కుప్పం, చిత్తూరుకు నీళ్లు తీసుకెళతామని అన్నారు.