ప్రత్యామ్నాయ విధానాలతో తృతీయ వర్గం

దానిని బలపరిస్తేనే ప్రజలకు న్యాయం
సెప్టెంబరు 15 న విజయవాడలో మహా గర్జన
కార్మిక గర్జనలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపు
మద్దతు ప్రకటించిన బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మహిళా కార్మిక సంఘాల నేతలు
విశాఖపట్టణం,జూలై13(జ‌నం సాక్షి):  రాష్ట్రంలో చంద్రబాబు పాలన పోయి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసిపి పాలన వచ్చినా ప్రజలకు, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె. రామకృష్ణ అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు, మోడీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎక్కడా వ్యతిరేకించడం లేదన్నారు. ఆయన అధికారంలోకి వచ్చినా ఇవే విధానాలను అమలు చేస్తారన్నారు. ప్రజలు, కార్మికుల సంక్షేమం అమలు కావాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో ముందుకొస్తున్న మూడో వర్గాన్ని బలపరచాలన్నారు. వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయన్నారు. శనివారం ఒక్కరోజే రాజమండ్రిలో దళిత సభ, తిరుపతిలో విద్యార్థులు, గుంటూరులో రైతులు, ఇలా పలు పట్టణాల్లో సదస్సులు, గ్రావిూణ, మండలాల్లో పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహించి పేదలు, రైతులు, సామాన్యులు, కార్మికవర్గానికి జరుగుతున్న అన్యాయంపై వివరిస్తామన్నారు. సెప్టెంబరు 15 లోపు కనీస వేతనాల సమస్య పరిష్కరించకపోతే అంతిమంగా సెప్టెంబరు 15 న విజయవాడలో పెద్ద ఎత్తున మహా గర్జన నిర్వహించి చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు శంఖారావు పూరిస్తామన్నారు. శుక్రవారం విశాఖలోని ఎయు కాన్వొకేషన్‌ హాల్లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కార్మిక గర్జనలో పలువురు వక్తలు మాట్లాడారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ ప్రతిపాదించిన రాజకీయ ప్రత్యామ్నాయ తీర్మానాన్ని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు బలపరుస్తూ ప్రసంగించారు. సభలో పాల్గొన్న నేతలు, కార్మికులు చేతులెత్తి తీర్మానాన్ని ఆమోదించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నరసింగరావు, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణరావు గర్జనకు అధ్యక్షత వహించిన ఈ సభలో లోక్‌సత్తా నేత మూర్తి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తి, సిపిఎం రాష్ట్ర నేత ఉమా మహేశ్వరరావు సిపిఎం, సిపిఐ జి ల్లా, నగర కార్యదర్శులు లోకనాథం, గంగారావు, వెంకటరమణ, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో సిపిఎం, సిపిఐ, జనసేన, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, ఎంసిపిఐ, బిఎస్సీ తదితర పార్టీలతో కూడిన కొత్త రాజకీయ శక్తిని ప్రజల ముందుంచుతామన్నారు. త్రిముఖ పోటీ నెలకొంటుందన్నారు.

తాజావార్తలు