ప్రత్యేక రాష్ట్రంపై నిర్లక్ష్యం తగదు
ఆదిలాబాద్, నవంబర్ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం నిర్లక్ష్యం తగదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1049వ రోజుకు చేరుకున్నాయి. కేంద్రం నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడుతున్నారని ఇప్పటికైనా నాన్చుడు ధోరణిని వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అనేక సాకులు చూపుతూ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేస్తోందని దీనితో ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. కేంద్రం వెంటనే ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.