ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే పతనం తప్పదు
ఆదిలాబాద్, జూన్ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు 894వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా కాంగ్రెస్, టిడిపిలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోరికను నెరవేర్చకపోతే తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. రాష్ట్రం సాధించేంతవరకు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.