ప్రత్యేక విజిలెన్స్‌ ద్వారానే రైతుల సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విజిలెన్స్‌ ఏర్పాటు చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయం, ఎరువుల కృత్రిమ బ్లాక్‌ తదితర సమస్యలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖరీఫ్‌ ప్రారంభమైన రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు నేటి వరకు అందలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిందని, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు అనేక అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి కేసుల్లో ఇరుక్కొని జైలు పాలయ్యారని ఆయన దుయ్యబట్టారు. రైతులకు ఏడు గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మరిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు