ప్రధానిమోడీ తెలంగాణను వ్యతిరేకించలేదు
వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న టిఆర్‌ఎస్ నేతలు
బ్రేకింగ్ కోసమే ప్రివిలేజ్ మోషన్: బండి
న్యూఢల్లీి,ఫిబ్రవరి10 (జనంసాక్షి): ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎక్కడా కూడా వ్యతిరేకించలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ..ఈరోజు బ్రేకింగ్, రేపు హెడ్ లైన్స్‌లో ఉండేందుకే టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని అన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ పెప్పర్ స్పే కొట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా విజయశాంతి పాల్గొంటే కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ హాజరుకాలేదనే అంశంపై తెలంగాణలో చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు కొరకు సుష్మాస్వరాజ్ పార్లమెంట్‌లో గళమెత్తారన్నారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము టీఆర్‌ఎస్‌కు లేదని తెలిపారు. రెండు రోజులు ఉందనగా సభను వాక్ ఔట్ చేశారని, గతంలో ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్‌ఎస్ సాధించింది ఏవిూలేదని చెప్పారు. రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పన్నెండు వందల మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు. చిన్న రాష్టాల్ర ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ అనుకూలమే అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ కించపరిచారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. రాజ్యాంగంపై నమ్మకం లేకపోతే కేసీఆర్ ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీపై ప్రివిలేజ్ కాదు ముందు కేసీఆర్‌పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలన్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ చంద్రుడు లాంటి వారని… ఆయనపై ఉమ్మి వేస్తే అది తిరిగి కేసీఆర్‌పైనే పడుతుందని వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు స్వాగతం పలుకుతున్నామని… వీరి రాకతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలోపేతం అవుతుందని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.