ప్రధాని మోడీ హత్యకు కుట్ర
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు
పాట్నా,జూలై14(జనం సాక్షి ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద కదిలక గురించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. అనంతరం పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు జూలై 11న నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి దేశంలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేగాక జూలై 12న మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్ర జరిగినట్లు వెల్లడిరచారు. అరెస్ట్ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్‌గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్‌ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. జూలై 6,7 తేదీల్లో మోదీ టార్గెట్‌గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒక దాంట్లో ’2047 వరకు ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలి’ అని ఉంది. వీటితోపాటు 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు