ప్రపంచగతిని మార్చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో ప్రపంచమే మారుతోంది
కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు
ఎఐతో సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం
’గ్లోబల్‌ ఏఐ’ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి పిలుపు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’గ్లోబల్‌ ఏఐ’ సదస్సుకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్‌ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్నీ తీసుకొస్తాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్‌ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. నాస్కామ్‌ సహకారంతో ఏఐ ఫ్రేమ్‌ వర్క్‌కు రూపకల్పన జరుగుతుంది. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు. రైల్‌ ఇంజిన్‌, టీవి, కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ దాకా వచ్చాయిన సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది.. ఎన్నికల ముందు డిక్లరేషన్‌ లో చెప్పినట్టే ఎఐ కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెట్టబడి దారులను ఆహ్వానిస్తున్నామనం ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎఐ రంగంలో పరిజ్ఞానం ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్‌ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏఐలో పూర్తిగా పట్టు సాదించబోతున్నామన్నారు. తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. డీప్‌ఫేక్‌ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఎథికల్‌ ఏఐ విషయంలో జపాన్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు సవిూపంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామని వివరించారు. రాబోయే రెండు రోజులు హెచ్‌ఐసీసీ వేదికగా ఏఐ పైనా చర్చలు, సెమినార్లు ఉంటాయని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌ డెవలప్‌మెంట్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని శ్రీధర్‌ బాబు అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దుర్వనియోగం చేయొద్దని ఆయన సూచించారు. హైదరాబాద్‌ లో 200 ఎకరాలు కేటాయించి ఏఐ సిటీని ఏర్పాటు చేస్తాము. రాబోయే మూడేళ్లల్లో గ్లోబల్‌ ఏఐ హబ్‌ గా హైదరాబాద్‌ అవతరిస్తుందని మంత్రి అన్నారు. ఏఐ పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా ఉందని ఐటీ మినిస్టర్‌ శ్రీధర్‌ బాబు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో నిపుణులైన 2వేల మంది ఏఐ నిపుణులు సదస్సుకు వచ్చారు.