ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా!


` అసెంబ్లీలో కాంగ్రెస్‌ విమర్శలపై మండిపడ్డ కేటీఆర్‌
` భట్టి విక్రమార్క విమర్శలపై మండిపడ్డ మంత్రి
` గత 60 ఏళ్లతో పోలీస్తే ఎన్నో రెట్ల నిధులుపెంచామని వెల్లడి
` కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య వాడీవేడి చర్చ
` విద్యారంగానికి కేటాయింపులపై వాదోపవాదాలు
` కంటోన్మెంట్‌ అధికారుల తీరుపై కేటీఆర్‌ గుస్సా
` ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తాం
` అసెంబ్లీ వేదికగా మరోమారు కేంద్రం తీరుపై ఆగ్రహం
హైదరాబాద్‌,మార్చి 12(జనంసాక్షి):శాసన సభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో విద్యారంగ కేటాయింపులపై మంత్రి కెటిఆర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల మధ్య చిన్నపాటి వాదం జరిగింది. విద్యారంª`గగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయని భట్టి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. భట్టి విమర్శలు తప్ప.. మంచిని గుర్తించడం లేదని తప్పుబట్టారు. 60 ఏళ్లలో కాంగ్రెస్‌ పాలనలో ఎన్ని రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 975 రెసిడెన్షియల్‌ స్కూళ్లను తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యతిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. అలాగే మనవూరు మనబడికి నిధులు కేటాయించామని అన్నారు. చేస్తున్న మంచి పనులను కూడా ఒప్పుకోకపోతే ఎలా అన్నారు. గత పాలనతో పోలిస్తే తెలంగాణ వచ్చాక విద్యారంగానికి కేటాయింపులు పెంయామని అన్నారు. అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమానికి నిధులు కేటాయించాలని, అంతేకాకుండా స్వీపర్లకు జీతాలు పెంచి వారిని పర్మినెంట్‌ చేయాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. భట్టి అంటే గౌరవం ఉందని.. కానీ ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. 60 ఏండ్లు రాజ్యం ఏలింది విూరు..విూ పార్టీనే కదా, భట్టి ధోరణి డొల్లగా ఉందన్నారు. మన ఊరు..మన బడి కి నిధులు ఇచ్చింది తెలియదా..? అని ఆయన వ్యాఖ్యానించారు. విూ హయాంలో కంటే 10 రేట్ల రెసిడెన్షియల్‌ స్కూల్‌ పెంచామని, భట్టి విమర్శ కోసం విమర్శలు చేస్తున్నారని, సీఎం నిన్న కాక మొన్ననే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ చెప్పారన్నారు. ప్రకటన రాగానే అయిపోతాదా..? కొంత టైం పట్టదా..? అని కేటీఆర్‌ తెలిపారు. దీనిపై వెంటనే భట్టి లేచి.. మన ఊరు.. మన బడికి ఇచ్చిన నిధులు ఈజేఎస్‌ నిధులే కదా..? ఒక దానికి కేటాయించిన నిధులు? ఇంకో దానికి బదిలీ చేశారని ఆరోపించారు. జిల్లా, మండల పరిషత్‌ లకే డబ్బులు లేకుంటే? వాటి నిధులు పక్క దారి పట్టించుకోవడం ఎందుకు..? అని ప్రశ్నించారు. నేను చెప్పేది ఒకటి..కేటీఆర్‌ చెప్తుంది ఇంకొకటని, సభను..ప్రజలను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ భట్టి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఊరు`మన బడి బాగా లేదని తాను చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఆ పథకానికి నిధులు లేవనే తాను చెప్పానన్నారు. సభలో చర్చ నడుస్తుందంటే కారణం తామేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహకరిస్తేనే సభ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి సభ్యులను ఏకపక్షంగా పంపడాన్ని ఆయన ప్రస్తావించారు. సభ్యులు లేకుండా ఎలా చర్చిస్తారని అన్నారు. అలాగే తాను డిప్యూటి స్పీకర్‌గా ఉండగా తెలంగాణపై ఎంత గలాటా చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ తాము గలాటా చేసి, బెంచీలు ఎక్కినందువల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు అంతా మంచిగా చర్చించు కోవాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. తిరిగి భట్టి మాట్లాడుతూ పాఠశాలలో చాలా ఖాళీలు ఉన్నాయన్నారు. పాఠశాలలో పనిచేసే వారి స్వీపర్ల జీతాలు ఇంకా 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి పథకానికి స్టేట్‌ బడ్జెట్‌ కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఏసీడీపీ నిధులను కేటాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇన్ఫాస్టక్చర్ర్‌తో పాటు పాఠశాలలో ఖాళీలు ఉండకుండా చూడాలని ఆయన కోరారు. ప్రభుత్వ స్కూల్‌ లో టీచర్‌ లు లేక ఇబ్బంది పడుతున్నారని, స్వీపర్లకు ఇంకా రూ. 2500 జీతమే ఇస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకండా వాళ్ళను రెగ్యులర్‌ చేయండి? జీతాలు పెంచండని ఆయన డిమాండ్‌ చేశారు. మన ఊరు..మన బడి కి నిధులు పెట్టి పని చేస్తే బాగుంటుందని, ఎమ్మెల్యే ఫండ్‌ నుండి కట్‌ చేసి ఇస్తే? ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్దతి కాదని, నేను చదువుకునే రోజుల్లో కూడా సింగల్‌ టీచర్‌ ఉండేదని, ప్రభుత్వ స్కూల్‌ అంటే అప్పట్లో అందరూ దృష్టి పెట్టే వాళ్ళు అని ఆయన వెల్లడిరచారు. కానీ ఇప్పుడు ప్రజలు పెద్దగా దృష్టి పెట్టే వాళ్ళు లేరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్‌ లేచి కాంగ్రెస్‌ మయాంలో కార్యకర్తలు చెప్పిన వారికే నిధులు ఇచ్చారని అన్నారు. అప్పుడు శ్రీధర్‌ బాబు మంత్రిగా ఉన్నాడని అన్నారు. దీనికి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ అప్పట్లో అంతా ఓ పద్దతి ప్రకారం నిధుల కేటాయింపు ఉండేదన్నారు. శాసనసభ చరిత్రలోనే ఆరేడు రోజుల్లో బడ్జెట్‌ను సమావేశాలను ముగించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని శ్రీధర్‌బాబు దెప్పి పొడిచారు. దీంతో శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. పద్దులపై కాంగ్రెస్‌ పాలనలో ఎప్పుడైనా చర్చ జరిపారా అని మంత్రి ఎదురు దాడికి దిగారు. ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధమని మంత్రి తెలిపారు. ఇంచార్జ్‌ మంత్రి సంతకం లేకుండా జిల్లాలో ఏ ఒక్కపని జరగదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. రాజకీయ సంప్రదాయాలకు పురుడు పోసిందే కాంగ్రెస్‌ అని తలసాని పేర్కొన్నారు. మంచిని ప్రతిపక్షం అస్సలు ఒప్పుకోవడం లేదని తలసాని అన్నారు.
కంటోన్మెంట్‌ అధికారుల తీరుపై కెటిఆర్‌ గుస్సా
కంటోన్మెంట్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోందని, అక్కడ రహదారులను మూసేస్తోందని మంత్రి కెటిఆర్‌ మరోమారు కేంద్రంపై ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంటోన్మెంట్‌కు నీళ్లు,కరెంట్‌ బంద్‌ చేస్తామని హెచ్చరించారు.అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్‌ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్‌ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమన్నారు. ఒక వైపు కంటోన్మెంట్‌లో చెక్‌ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోంది. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్‌ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్‌ఐ అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇలా కంటోన్మెంట్‌, ఏఎస్‌ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని విమర్శలు గుప్పించారు. ఇది మంచి పద్ధతి కాదు.. కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని ఆదేశిస్తామని మంత్రి తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్‌ చేస్తాం.. నాలాల విూద చెక్‌ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోమంటూ తేల్చి చెప్పారు. అవసరమైతే కంటోన్మెంట్‌కు మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరారా అంటూ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్‌ అధికారులపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్‌ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్‌ చేస్తే.. తాము కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తామని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.తెలంగాణ వేరే దేశం అన్నట్టు కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్‌ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్‌ చేస్తాం.. నాలాల విూద చెక్‌ డ్యాంలు కడుతామంటే మేం కూడా ఊరుకోం అని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరారా అని కేటీఆర్‌ పేర్కొన్నారు.కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని ఆదేశిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు, కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభలో చెప్తున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. పైసా సాయం చేయరు కానీ పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధం కలిగించడం సరికాదని కేటీఆర్‌ మండిపడ్డారు.

తాజావార్తలు