ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. 

మావోల కుట్ర చేశారు
– బీమాకోరేగావ్‌లో అల్లర్లతో పౌరహక్కుల నేతలకు సంబంధాలున్నాయి
– సదరు నేతలకు మావోలతో సంబంధాలున్నాయి
– నిర్దారణ చేసుకున్న తరువాతే అరెస్టు చేశాం
– విలేకరుల సమావేశంలో మహారాష్ట్ర ఏడీజీ పరమ్‌ బీర్‌సింగ్‌
ముంబయి, ఆగస్టు31(జ‌నం సాక్షి) : మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు మావోలు కుట్ర చేశారని, వారికి పౌరహక్కుల నేతలు సహకారం అందించారని, నిజనిర్దారణ తరువాతనే వారిని అరెస్టు చేశామని మహారాష్ట్ర ఏడీజీ పరమ్‌ బీర్‌ సింగ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటనపై శుక్రవారం మహారాష్ట్ర పోలీసుశాఖలోని ఏడీజీ పరమ్‌ బీర్‌ సింగ్‌ కొన్ని వివరాలు వెల్లడించారు. బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లతో హక్కుల నేతలకు సంబంధాలు ఉన్నాయని, స్పష్టంగా తెలిసిన తర్వాతనే అరెస్టులు చేశామని ఆయన వెల్లడించారు. ఆ నేతలకు మావోలతో సంబంధాలు కూడా ఉన్నట్లు స్పష్టమైందన్నారు. 2017, డిసెంబర్‌ 31వ తేదీన బీమా కోరేగావ్‌లో అల్లర్లు జరిగాయి. ఆ ఘటనకు సంబంధించిన కేసును జనవరి 8వ తేదీన నమోదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్ల కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఏడీజీ తెలిపారు. కబీర్‌ కాలా మంచ్‌తో ప్రతి నేతకు సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలదోయాలన్న నెపంతో మావోలు అడుగులు వేశారని ఏడీజీ పరమ్‌ బీర్‌ సింగ్‌ తెలిపారు. అయితే మావోలు వేసిన ప్రణాళికలకు.. పౌర హక్కుల నేతలు సహకరించారన్నారు. ఈ కుట్రలో ఓ ఉగ్రవాద సంస్థకు కూడా ప్రమేయం ఉందన్నారు. పౌర హక్కుల నేతలు సుదా భరద్వాజ్‌, గౌతమ్‌ నవలక, అరుణ్‌ ఫెరిరా, వెర్నన్‌ గొంజాలెజ్‌, వరవరరావులను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్లను గృహనిర్బంధంలో ఉంచారు. పౌర హక్కల నేతలు మావోలతో సంభాషణలు జరిపిన కొన్ని లేఖలను ఏడీజీ తన ప్రెస్‌విూట్‌లో విూడియా ముందు ప్రదర్శించారు.