ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యల పరిష్కారం : కృష్ణమాదిగ

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వృద్ధులు, వితంతువుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రథయాత్ర సోమవారం ఆదిలాబాద్‌ చేరుకున్న సందర్భంగా స్థానిక విశ్రాంతి భవనం ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల ద్వారా ఎన్నో హక్కులు సాధించుకున్నామని, పింఛన్ల పెంపుకోసం వృద్ధులు, వితంతువులు తమకు అండగా ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు. వృద్ధులు, వితంతువులకు కేంద్రప్రభుత్వం 225 రూపాయలు పింఛన్‌ విడుదల చేస్తుండగా దానికి తోడు పక్క రాష్ట్రాలు కూడా కొంత కలిపి పింఛన్లు అందజేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ తరహాలో అందించడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో మెనిఫెస్టోలో ఐదు వందల రూపాయల మేర పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది వృద్ధులు, వితంతువులు ఉన్నప్పటికీ వారి సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్‌ వరకు అన్ని జిల్లాల్లో రథయాత్ర చేస్తున్నామని, డిసెంబర్‌ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన బహిరంగ సభకు వృద్ధులు, వితంతువులు పెద్ద ఎత్తున పాల్గొంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చని అన్నారు. ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించవచ్చని వితంతువులు, వృద్ధులు తమ వెంట ఉంటే ముఖ్యమంత్రిని నిలదీసి పెన్షన్లను సాధించుకుంటామని కృష్ణమాదిగ స్పష్టం చేశారు. ఈ సభలో ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు రజీ హైదర్‌, నర్సింగ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆదిలాబాద్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పాయలశంకర్‌, కృష్ణమాదిగను శాలువతో సత్కరించి ఆయన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.