ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం

– టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు అన్నారు.బుధవారం సూర్యాపేట పట్టణ,చివ్వేంల మండల సంఘ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు లేక ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ నిపుణుల కొరత వేధిస్తుంటే ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కావడానికి తగిన ప్రణాళిక లేదన్నారు.పదోన్నతులను చేపట్టే వరకూ విద్యావలంటీర్లను  నియమించాలన్నారు.మారుమూల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారని, వెంటనే బదిలీలు చేపట్టాలన్నారు.పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి,విద్యా వ్యవస్థను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేవలం మూడు వేల రూపాయల వేతనంతో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను వేతనాలను భారంగా భావించి తొలగించడంతో పాఠశాలలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయన్నారు.పాఠశాలలు మొదలై  40 రోజులు గడిచినా ఇప్పటికీ ఏకరూప దుస్తులు రాలేదని, పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదన్నారు.జీవో 317 వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు.పెండింగ్ బిల్లులను వెంటనే పూర్తి చేసి సకాలంలో వేతనాలు చెల్లించాలని  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య , జిల్లా అధ్యక్షులు పర్వతం సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి యామా రమేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లంకొండ రామ్మూర్తి , జిల్లా నాయకులు బ్రహ్మచారి, శ్రీనివాసచారి, వెంకటరెడ్డి , శ్రీధర్, సాయికుమార్, తిరుమలేష్, ఉపేందర్ ,ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.