ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కారించాలని విద్యార్థుల ప్రదర్శన – ధర్న – వినతి

– పి డి ఎస్ యు విద్యార్థి సంఘం డిమాండ్

టేకులపల్లి ,ఆగస్టు 3( జనం సాక్షి ): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో టేకులపల్లి మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులతో బుధవారం భారీ సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మండల అభివృద్ధి అధికారి మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి జె గణేష్ మాట్లాడుతూ టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు 200కు పైగా విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతి గదులు శుభ్రపరిచే వారు లేక గదులు దుమ్ము, ధూళితో ఉంటున్నాయి.  ప్రతిరోజు విద్యార్థులే గదులను శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మధ్యాహ్న భోజనం దొడ్డు బియ్యం, నాణ్యతలేని కూరలు వలన విద్యార్థులు భోజనం సగం కడుపులో నింపుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అన్నారు. పాఠశాల సమస్యలపై దృష్టి సారించి ఈ సమస్యల ను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజులలో సమస్యలను పరిష్కరించకుంటే పిడిఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో మండల నాయకులు బి. కుమార్, దివ్య, భవాని, రాజేష్ ,రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.