ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతోంది: వైకాపా

గుంటూరు,నవంబర్‌22(జ‌నంసాక్షి): టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నట్లు చెప్పారు. ప్రజాపాలన పక్కన పెట్టి రాజధాని పేరుతో విదేశీ యాత్రలను జరుపుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు అధైర్య పడవద్దని, రానున్న ఎన్నికల్లో జగనన్న సారథ్యంలోని ప్రజల పాలన అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కరవుతో అల్లడిన రైతుల పూజలు ఫలించి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో 575 అడుగుల నీరు చేరిందని, రైతుల ఆకలి మంటలు తీర్చలేని రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయటం లేదనిఆరోపించారు.గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగర్‌ ప్రాజెక్టులో 540 అడుగుల నీరున్నా రెండు పంటలకు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం 575 అడుగులు ఉన్నా ఒక్క పంటకూ నీరవ్విలేని అసమర్థుని పాలనలో ఉండటం సిగ్గు చేటన్నారు. సాగునీటి అవసరాలు తీర్చాలన్న డిమాండ్‌ను చంద్రబాబు తక్షణం తీర్చాలని అన్నారు.