ప్రభుత్వ స్కూళ్లలోనేపిల్లలను చేర్పించాలి

ప్రైవేట్‌ మోజులో చేతులు కాల్చుకోవద్దు

మెదక్‌,జూలై15(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. దీనిని తల్లిదండ్రులు గమనించాలని అన్నారు. ప్రైవేట్‌ మోజులపడి డబ్బు వృధా
చేసు కోవద్దని అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ప్రత్యేకంగా గురుకులా లు ఏర్పాటు చేశామని, ఇటీవల 119 బీసీ గురుకులాలను ప్రారంభించి వెనుకబడిన బీసీలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో విద్యారంగంలో ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు మంజూరు చేసి ప్రారంభించిన ఘనత లేదన్నారు. మానవ అభివృద్ధి సూచికల్లో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని అందుకే రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించేందుకు మూడేళ్లుగా సుమారు ఐదు వందల గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పేద విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మైనారిటీ వర్గాల్లో విద్యాభ్యాసం లేక అభివృద్ధి చెందడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని గమనించి దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేకంగా మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు.వచ్చే ఏడాది మరిన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాలయాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హావిూలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.