ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పరీక్ష తుది …

స్టాఫ్‌ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్సార్బీ) తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31వ తేదీన నియామక పత్రాలు అందజేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం 2022 డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 9 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సుమారు 40వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. వారికి గతేడాది జూలైలో ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించింది. తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రక్రియకు తాత్కాలిక ఆటంకం కలిగింది. కొత్త ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగింది. గత నెలలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా విడుదల చేసిన మెరిట్‌ లిస్ట్‌ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. మెరిట్‌ లిస్ట్‌ తప్పుల తడకగా ఉన్నదంటూ కొంత మంది అభ్యర్థులు కోఠిలోని మెడికల్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు వద్ద ఆందోళన చేపట్టారు. తక్కువ మారులు వచ్చిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. నార్మలైజేషన్‌పై, వెయిటేజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బోర్డు అధికారులు ప్రత్యేకంగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు తీసుకున్నారు. అందరికీ సమాధానాలు ఇచ్చారు. దీంతో నియామకాలకు అడ్డంకులు తొలిగినట్టయింది. సెలక్షన్‌ లిస్ట్‌ను ఎంహెచ్‌ఎస్సార్బీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.