ప్రమాదకరంగా కొల్లేరు ప్రవాహం
ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు
ఏలూరు,సెప్టెంబర్5 ( జనం సాక్షి ) : ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది.
దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. హైవేపై మోకాలి లోతు నీటిలో బస్సులు, ఇతర వాహనాలు ప్రమాదకరంగా ముందుకు సాగుతున్నాయి. వరద ఉద్ధృతి దృష్ట్యా అధికారులు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పెనుమాక, ఇంగిలిపాక, నందిగామ లంక, కొవ్వాడలంక, నుచ్చుమిల్లి గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటున్నారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు కొల్లేరును దాటే ప్రయత్నం చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు, మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు.