ప్రమాదవశాత్తు పేలిన డిటోనేటర్‌

బాలుడికి గాయాలు: ఆస్పత్రికి తరలింపు
అనంతపురం,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు గ్రామంలో డిటోనేటర్‌ పేలి రియాజ్‌ (7) అనే నాలుగో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  దీంతో బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన కర్ణాటకలోని బళ్లారిలో గల విజయనగర మెడికల్‌ సైన్స్‌ (విమ్స్‌) ప్రధాన వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలుడికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. రియాజ్‌ సోమవారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో డిటోనేటర్‌ దొరికింది. దాన్ని బాలుడు బ్యాగులో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో ఇంటి ముందు దానితో ఆడుకుంటూ రాయితో కొట్టగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ప్రమాదంలో బాలుడి ఎడమ చేయి, తొడ భాగం, అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో పెద్ద సంఖ్యలో కంకర క్వారీలు ఉన్నాయి. నేమకల్లు ప్రాంతంలోనే సుమారు 20వరకు క్వారీలు ఉన్నాయి. రోజూ పెద్ద పెద్ద గుండ్లు, రాళ్లను పేల్చడానికి జిలెటిన్‌ స్టిక్స్‌ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు. అటువంటి సమయంలో పేలుడు పదార్థాలపై డిటోనేటర్‌లు అమర్చుతారు. ఇటీవల కర్నూలు జిల్లా హత్తిబెళగల్‌లోని క్వారీలో పేలుడు వల్ల పలువురు
మృతిచెందగా , మరికొందరు తీవ్ర గాయాలపాలైన సంఘటన తెలిసిందే. దీనిపై అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను సంప్రదించగా, నేమకల్లు గ్రామంలో డిటోనేటర్‌ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బాలుడికి ఆ డిటోనేటర్‌ ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకుంటామన్నారు. జిల్లాలో కొనసాగున్న క్వారీలపై పోలీస్‌ శాఖ నిఘా పెంచిందని ఎస్పీ తెలిపారు.

తాజావార్తలు