ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గ్రామస్థులు

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : ఎల్లంపల్లి-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో భూములు కోల్పోయిన గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వ పనులను తమ పొలాల గుండ తవ్వకాలు జరుపుతున్నారని, దాని ద్వారా తమ పొలాల భూములు కోల్పోతున్నామని ఆందోళన చెందారు. ఈ విషయం సంబంధిత అధికారులకు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని, ప్రస్తుత ధరను బట్టి తమకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విషయం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులకు, మంత్రులకు నష్టపరిహారం చెల్లించాలని ఎన్నో మార్లు చెప్పుకున్నా నష్టపరిహారం చెల్లించలేదని, అందువల్లనే ప్రాజెక్టు పనులను జరగకుండా అడ్డుకున్నామని అన్నారు. ఇప్పటికైనా న్యాయంగా అందాల్సిన నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.