ప్రాణాలు కాపాడిన ‘బ్రా’

బీజింగ్ (సెప్టెంబర్ 11): చైనాలో ఓ మహిళ తాను ధరించిన బ్రా కారణంగా బతికి బయటపడింది. వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంది కానీ.. దీనిని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఎంతో కొంత సైన్సు పరిజ్ఞానం మాత్రం ఉండి తీరాల్సిందే. ఆ మహిళ ధరించిన బ్రా పిడుగుపాటు వల్ల వెలువడే విద్యుత్తును దారి మళ్లించి కీలకమైన అవయవాలకు గాయాలు కాకుండా కాపాడింది. అయితే దీనిలో కీలకపాత్ర పోషించింది మాత్రం ఆమె ధరించిన బ్రాలో ఉన్న మెటల్ వైర్లే.
చైనాలోని బీజింగ్ నగరం దగ్గర్లోని ఓ ప్రాంతం చాలా రోజులుగా తుఫానులో చిక్కుకుంది. ఆ ప్రాంతానికి చెందిన లాయ్ అనే మహిళ తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకురావడానికి గొడుగు వేసుకుని బయలుదేరింది. ఓ చెక్క బ్రిడ్జి వద్దకు రాగానే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆమె గొడుగుకు ఉన్న మెటల్ ఫ్రేమ్ కారణంగా అది ఆమె వైపునకు దూసుకువచ్చింది. సరాసరి ఆమె చెస్ట్‌లోకి ప్రవేశించింది. అయితే ఆమె ధరించిన బ్రా ఆ పిడుగును అడ్డుకుంది. ఆ బ్రాలోని మెటల్ వైర్లు ఫారడే కేజ్‌లా పనిచేసి ఆ మెరుపులోని తీవ్రత తగ్గించి విచ్ఛిన్నం చేశాయి. ముఖ్యమైన అంగాలకు ప్రమాదం వాటిల్లకుండా అడ్డుకున్నాయి. అయితే ఆ ధాటికి ఆమె ధరించిన దుస్తులు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. చర్మం కూడా కాలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు ధ్రువీకరించారు.