ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు నీటితో సస్యశ్యామలం
కరీంనగర్, డిసెంబర్ 8 : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే సాగునీటితో తెలంగాణ జిల్లాల్లోని వ్యవసాయ భూములు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారంనాడు మంత్రి సిరిసిల్ల మండలం రెగుడు వద్ద బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం లింకు-3 ప్యాకేజీ నంబర్ 9 పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గానికి సాగునీటి ద్వారా భూములు సస్యశ్యామలమై పంటలు పండడమే గాక ఈ ప్రాంత ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ ప్రాంతంలోని సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులు తమ పంటలను సంతోషంతో పండించుకోవచ్చని అన్నారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోకుండా నిధులు మంజూరు చేసి అనుకున్న గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చే సంవత్సరం జూన్‌కల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తామని అన్నారు. వ్యవసాయంలో రైతులు ఆధునిక పద్ధతులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందాలని మంత్రి సూచించారు. గోదావరి నీటి నుండి విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులకు రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మంత్రి మార్పు పథకానికి సంబంధించిన జిల్లా బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన జరిగిందని అన్నారు. ఈ ఎత్తిపోతల పథకం వల్ల సిరిసిల్ల ప్రాంతంలో అధిక పంటలు సాగులోకి వస్తాయని అన్నారు. అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పూర్తిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల కొరత లేకుండా చూస్తామని ఆయన అన్నారు.
ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి చేసేందుకు తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. వరద కాల్వ రెండు పనులు వేగవంతంగా ప్రభుత్వం పూర్తి చేయాలని ఎంపి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీ ఎన్ లక్ష్మణరావు, సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు తదితరులు పాల్గొన్నారు.