ప్రారంభమైన కలాల కవాతు
హైదరాబాద్: జీవ వైవిద్య సదస్సు నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాను అవమానించిన విషయం విదితమే. దీనిపై నిరసనగా ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు తెలంగాణ పాత్రికేయిలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదాండరాం, టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ పాత్రికేయిలపై వివక్ష చూపటం దారుణమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ మీడియాపై సీమాంధ్ర సర్కార్ చూపిన వివక్షకు నిరసనగా కలాల కవాతు చేపట్టామని తెలిపారు. మీడియా స్వేచ్ఛ హరించవద్దని ప్రగల్భాలు పలికే సీమాంధ్ర మీడియా సంస్థలు తమకు ఎందుకు మద్దతు పలకటం లేదని ప్రశ్నించారు. సర్కార్ క్షమాపణ చెప్పేదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ ప్రభుత్వంపై ప్రెస్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, పలు పార్టీలకు చెందిన నాయకులు, పత్రికల జర్నలిస్టులు కవాతులో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.