ప్రారంభమైన జోనల్‌ స్థాయి క్రీడాపోటీలు

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలన్న ఎమ్మెల్యే
కాకినాడ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని అనపర్తి శాసనసభ్యులు ఎన్‌. రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం కొత్తూరులోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సెంటీనరీ సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో జోన్‌2 జోనల్‌ స్థాయి గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రూ. 1.35 కోట్లతో కొత్తూరులో రహదారి నిర్మాణాలు చేశామన్నారు. మరో రూ. 2 కోట్లతో కొత్తూరు నుంచి లక్ష్మినర్సాపురంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వరకు రహదారి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో జిల్లా నుంచి 280, పశ్చిమ గోదావరి నుంచి 160, కృష్ణా నుంచి 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని జిల్లా సమన్వయకర్త సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు దేవదాన రెడ్డి, కళాశాలల ప్రధానోపాధ్యాయులు ఆనంద్‌ బాబు, మధుసూదన్‌ రావు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు