ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీలు

సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగం

ఏలూరు,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): అంగన్‌వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవి ప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రీస్కూల్‌ బోధన ప్రారంభించారు. 3 ఏళ్ల వయస్సున్న చిన్నారులను నర్సరీ, 4ఏళ్ల చిన్నారులను ఎల్‌కేజీ, 5 ఏళ్ల చిన్నారులను యూకేజీలో చేరుస్తూ తరగతులుగా విభజించి ఆంగ్లమాధ్యమం కూడా బోధిస్తున్నారు. దీనిపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ప్రీస్కూల్‌ విధానం ప్రవేశపెట్టడంతో అక్కడ పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఐసీడీఎస్‌, పురపాలక సంఘాల అధికారులు చెబుతున్నారు. పురపాలక సంఘాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు కొత్త రూపుతో కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాలకు కొత్తకొత్త సామగ్రి సమకూరుస్తున్నారు. ముందుగా పురపాలక సంఘాల్లోని కేంద్రాల్లో పనులు చేపడుతున్నారు. పురపాలక సంఘాల నిధులతో పలు చోట్ల సదుపాయాలు కల్పించారు. దీనికితోడు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. శిథిలావస్థ భవనాలు..ఇరుకు గదులు.. చాలీచాలని వరండాలతో ఇంతకాలం అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల నిధులను వీటికోసం ఖర్చు చేయడంతో పాటు దాతల సహాయం తీసుకుని అభివృద్ధి బాటలో నడిపించాలని ముఖ్యమంత్రి అభిలషించారు. సీఎం చంద్రాబు ఆలోచనలకు తగ్గట్లుగానే అంగన్‌వాడీ కేంద్రాల స్వరూపమే మారిపోతోంది. కార్పోరేట్‌ స్థాయిలో ఆ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో పురపాలక సంఘాల నిధులతో వాటి పరిధిలోని కేంద్రాలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్రాల్లో చిన్నారులకు కూర్చునేందుకు కుర్చీలు, టేబుళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, యూనిఫామ్‌ , ఆట పరికరాలు సమకూరుస్తున్నారు. భవనాలకు రంగులు వేసి వాటిపై ఆకర్షణీయమైన బొమ్మలు వేస్తున్నారు. సదుపాయాలు కల్పించారు. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 300 కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని పక్కనున్న కేంద్రాల్లో కలిపారు. మూడు కేంద్రాలను ఒకటిగా మార్చారు. కొన్నిచోట్ల రెండేసి కేంద్రాలను కలిపారు. మిగిలినవి పాతవాటినే కొనసాగిస్తున్నారు.

తాజావార్తలు