ప్రో కబడ్డీ విజేత యు ముంబా!
టోర్నీ తొలి నుంచి తుది వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యు ముంబానే టైటిల్ వరించింది. గతేడాది ఫైనల్లో భంగపడ్డ ముంబా ఈ సారి సొంతగడ్డపై ట్రోఫీని ఒడిసిపట్టుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన తుదిపోరులో ముంబా 36-30తో బెంగళూరు బుల్స్ ను ఓడించి విజేతగా నిలిచింది. ట్రోఫీతో పాటు కోటి రూపాయల ప్రైజ్‌మనీ కైవసం చేసుకుంది. ముంబా కెప్టెన్ అనూప్ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రన్నరప్ బుల్స్ రూ. 50 లక్షలు దక్కించుకుంది. వర్గీకరణ పోరులో పాట్నా పైరేట్స్ ను ఓడించిన తెలుగు టైటాన్స్ మూడో స్థానంలో నిలిచి రూ. 30 లక్షలు గెలుచుకుంది. పైరేట్స్ కు 20 లక్షల నగదు దక్కింది. ఢిల్లీ ప్లేయర్లు కాశిలింగ్ అడ్కే ‘బెస్ట్ రైడర్ ఆఫ్ టోర్నమెంట్’గా, రవీందర్ ‘బెస్ట్ డిఫెండర్’గా ఎంపికయ్యారు. టైటాన్స్ డిఫెండర్ సందీప్ ‘రైజింగ్ స్టార్’ అవార్డు అందుకున్నాడు. బెంగళూరు కెప్టెన్ మన్‌జీత్ చిల్లార్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా ఎంపికయ్యాడు