ప్లాస్టిక్‌ నిషేధంపై కానరాని చిత్తశుద్ది

పట్టణంలో ప్లాస్టికి వేస్ట్‌తో  సమస్యలు
కర్నూలు,జూలై 19(జ‌నంసాక్షి): కర్నూలు నగరంలో ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్న తీరు కారణంగా అనేక అనర్థాలకు దారితీస్తోంది. ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చినా అది కాగితాలకే పరిమితమైంది. అధికారులు అడపాదడపా దాడులకే పరిమితం అయ్యారు. దీంతో ఏ దుకాణంలో చూసినా ప్లాస్టిక్‌ కవర్లే కనిపిస్తున్నాయి. వినియోగించిన ప్లాస్టిక్‌ ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలుగా దర్శనమిస్తోంది. కాలువల్లో నిండిపోయి మురికినీరు పోకుండా అడ్డుపడుతోంది. పశువులు వీటిని తిని మృత్యువాత పడుతున్నాయి.
అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటి వరకు 3.50 టన్నుల ప్లాస్టిక్‌ కవర్లను సీజ్‌ చేయడమేగాక జరిమానా రూపేణా సుమారు రూ.7.50 లక్షలు వసూలు చేశారు. అయినా వినియోగం కొనసాగుతూనే ఉంది. కార్పొరేషన్‌ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు నియమించినా ఫలితం లేదు. 51 డివిజన్లలోని ఏ మురుగు కాలువ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండి ఉంటాయి.
దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో జ్యూట్‌ బ్యాగులను అందుబాటులో ఉంచాలి. సాధారణ ప్లాస్టిక్‌ కవర్ల కన్నా కాస్త ఎక్కువ ధర ఉన్న వీటిని ఒక్కసారి కొంటే ఏడాదికిపైగానే వినియోగించుకోవచ్చు. ప్రజలు కూడా దుకాణానికి వెళ్లేటప్పుడు బ్యాగు తీసుకెళ్లడం మంచిది. జ్యూట్‌ బ్యాగుల తయారీ బాధ్యతను కేఎంసీ పరిధిలోని డ్వాక్వా గ్రూపులకు ఉపాధి మార్గాలుగా అందించవచ్చు. వీటిని నేరుగా అధికారులే
విక్రయదారులకు అందించడం వల్ల మహిళలకు ఆదాయవనరు చూపించినట్లవుతుంది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో ఉత్పత్తి అవుతున్న వందలాది టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌కు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఉత్తర భారతదేశంలోని సంబంధిత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ ముడి సరుకు విక్రయం ద్వారా ఆదాయం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తక్కువ ఖర్చులో పూర్తయ్యే ప్లాస్టిక్‌ రోడ్లను కూడా కొన్ని కార్పొరేషన్లు అనుసరిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగానికి ప్రత్యామ్నాయంగా జ్యూట్‌ బ్యాగుల తయారీ, ఎ/-లాస్టిక్‌ రోడ్ల నిర్మాణాలు వంటి ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నా అమలు కావడం లేదు.  కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్‌ వీరపాండియన్‌, కమిషనర్‌ రవీంద్రబాబు ఈ దిశగా చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.