ఫిలింనగర్‌లో దారుణం..


– భర్తను కడతేర్చిన భార్య
– నోట్లో ‘హిట్‌’ కొట్టి హతమార్చిన వైనం
– స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు
– మృతుడు జగన్‌ది గుంటూరు జిల్లా మాచర్ల
– భార్య దేవికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌, ఆగస్టు7(జ‌నంసాక్షి) :  బంజారాహిల్స్‌లోని ఫిలింనగర్‌లో దారుణం జరిగింది. సైదప్ప బస్తీలో మంగళవారం తెల్లవారుజామున బానోతు జగన్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. వివరాల్లోకి వెళితే..
బంజారాహిల్స్‌ ఫిలింనగర్‌లోని సైదప్ప బస్తీలో జగన్‌, అతని భార్య దేవిక, ఇద్దరు పిల్లలు నివాసముంటున్నారు. జగన్‌ది గుంటూరు జిల్లా మాచర్ల గ్రామం. వీరికి కొద్దేళ్ల క్రితం వివాహమైంది. వీరి పెళ్లి నాటి నుండి తరచు వివాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. కాగా జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి గత రెండు నెలల క్రితం గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి సైదప్ప బస్తీలో నివాసముంటున్నారు.   కాగా మంగళవారం ఉదయం ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పైఫ్లోర్‌కు వెళ్లి చూశాడు. దీంతో జగన్‌ చనిపోయి ఉన్నాడని గమనించిన యాజమాని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడటాన్ని గమనించాడు. ఎలా చనిపోయాడని జగన్‌ భార్య దేవికను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని యాజమాని చెబుతున్నారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు. జగన్‌ చాలా మంచి వ్యక్తి అని, మృతుడిని ఆ వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం భార్య దేవికను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. మృతుడిది జగన్‌ స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల. జగన్‌ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్‌ ప్రతి రోజూ తప్పతాగి వచ్చి భార్య దేవికను విపరీతంగాకొట్టేవాడని, కుటుంబ ఘర్షణల కారణంగా రోజూ వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకొనేదని తెలుస్తోంది. ఈ తరుణంలో మంగళవారం ఉదయం మద్యం మత్తులో ఉన్న జగన్‌ నోటిలో హిట్‌ కొట్టి ఆ తరువాత దేవిక హతమిర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇంటి యాజమాని చెప్పినట్లు మరో వ్యక్తి ఎవరనేది దేవికనుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.